ప్రాజెక్టుల కింద ఎకరం ఎండినా సర్కార్‌‌‌‌దే బాధ్యత: మంత్రి ఉత్తమ్

ప్రాజెక్టుల కింద ఎకరం ఎండినా సర్కార్‌‌‌‌దే బాధ్యత: మంత్రి ఉత్తమ్
  • బోర్ల కింద పంటలు ఎండితే మాకు సంబంధం లేదు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం ఎండినా రాష్ట్ర సర్కార్‌‌‌‌దే బాధ్యత అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. సోమవారం అసెంబ్లీలోని లాబీలో మీడియాతో ఆయన చిట్‌‌చాట్ చేశారు. ప్రాజెక్టుల కింద సాగు చేసిన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండనివ్వబోమని, ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎక్కడైనా ఎండితే తమదే బాధ్యత అని, బోర్ల కింద వేసిన పంటలు ఎండితే మాత్రం తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ ఎండా కాలంలో వరి ఎంత వేయాలో రైతులకు తెలుసని చెప్పారు. ప్రాజెక్టుల కింద వరి పంటలకు సాగు నీరు అందేలా చూసేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామని ఆయన తెలిపారు.

‘‘గత వానకాలం సీజన్‌‌లో రాష్ట్రంలో రైతులు 55 లక్షల ఎకరాల్లో వరి పండించారు. సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు క్వింటాల్‌‌కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చాం. అందుకే యాసంగిలో కూడా వరి పంట, అందులోనూ సన్నాలు ఎక్కువ వేశారు’’అని అన్నారు. తాను ఏపీలో చంద్రబాబును కలిసినప్పుడు చేపల పులుసు తిన్నట్లు బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

డాక్టర్ల సూచన మేరకు తాను నాన్ వెజ్‌‌ను మానేసి ఐదేండ్లు అవుతుందని, అలాంటప్పుడు తాను చేపల పులుసు ఎలా తింటానని ప్రశ్నించారు. హరీశ్ రావు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరైంది కాదని ఫైర్‌‌‌‌ అయ్యారు.