
- చెత్తకుప్పలో చిన్నారి డెడ్ బాడీ
- యాదగిరి గుట్టలోని
- పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఘటన
యాదగిరిగుట్ట, వెలుగు: చెత్త కుప్పలో చిన్నారి డెడ్ బాడీ కనిపించిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలోని చెత్తకుప్పలో ఆడశిశువు డెడ్ బాడీ మంగళవారం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి వెళ్లి చూడగా అప్పటికే శిశువు చనిపోయింది.
చిన్నారి వయసు రెండు రోజులకు మించి ఉండదని యాదగిరిగుట్ట సీఐ రమేశ్చెప్పారు. ప్రాణాలతో ఉండగానే వదిలేశారా..? చనిపోయిన శిశువును చెత్తకుప్పలో పడేశారా..? అనేదానిపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఘటనకు సమీపంలోని పీహెచ్సీలో విచారిస్తే రెండు రోజులుగా డెలివరీలు కాలేదని వైద్య సిబ్బంది చెప్పారని, స్థానిక ఆస్పత్రుల్లో కూడా ఎంక్వైరీ చేస్తామని సీఐ చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాలో వాగులో మరో శిశువు
గుడిహత్నూర్: వాగులో పసికందు డెడ్ బాడీ లభించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామస్తులు కొందరు మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శివారులో టాయిలెట్ కు వెళ్లారు. ఎండిపోయిన వాగులో శిశువు డెడ్ బాడీ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లి చిన్నారి డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని రిమ్స్ కు తరలించారు.
స్థానికుల నుంచి ప్రాథమిక వివరాలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత శిశువు వయస్సు సుమారు 6 నెలలు ఉంటుందని రిమ్స్ డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని సీఐ భీమేశ్, ఎస్ఐ మహేందర్ తెలిపారు.