- నాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్‌రావు అండ్ కో
- ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్ల మీద నిఘా
- వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్
- సూర్యాపేటలో మైహోమ్ కోసం మూడు రోజులు డ్యూటీ
- నల్గొండ జిల్లా మూడు బైపోల్స్‌లో ఎస్ఐబీ కీలక పాత్ర
- పాలమూరులో పోలీస్‌స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్
- ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనుకా ఎస్ఐబీ టీమ్
వెలుగు నెట్వర్క్/ మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అండ్ టీమ్ నెట్వర్క్ జిల్లాలకూ విస్తరించిందనేందుకు కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల వ్యూహాలు తెలుసుకునేందుకు, సొంత పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు, ప్రత్యర్థి పార్టీల డబ్బును కట్టడి చేసేందుకు, ఆఖరుకు మైహోమ్ లాంటి సంస్థల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అప్పటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిందే తడువు వాళ్ల ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారులు, సామాన్యుల ఫోన్లనూ ట్యాప్‌చేసి, ఆ సమాచారాన్ని అందించేవారని తెలుస్తున్నది.
ఆ ఫోన్ డేటాతోనే అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్లాక్‌మెయిలింగ్ కు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి కోసం పర్వతగిరిలో వార్‌రూమ్ ఏర్పాటుచేసిన విషయం ఇప్పటికే వెలుగుచూడగా, మరో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోసం పాలమూరులోని ఓ పోలీస్‌స్టేషన్‌నే వార్‌రూమ్‌గా మార్చిన సంగతి తాజాగా బయటపడింది. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన వాళ్లను అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికించడం వెనుక నాటి ఎస్ఐబీ పాత్ర ఉన్నదనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఎన్నికల కేసు వాపస్ తీసుకోలేదని..
2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ చాలా అంశాలను పొందుపర్చలేదని పాలమూరుకు చెందిన చలువగాలి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి 2019లో కోర్టులో కేసు వేశారు. ఈ కేసును వాపస్ తీసుకోవాలని అతని మీద మాజీ మంత్రి తీవ్రంగా ఒత్తిడి చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసినా కేసు వాపస్ తీసుకోకపోవడంతో రాఘవేందర్ రాజుతో పాటు అతనితో సన్నిహితంగా ఉండే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలిసింది.
వీరు ఎవరితో మాట్లాడుతున్నారు? కేసుకు సంబంధించి ఏం డిస్కస్ చేస్తున్నారన్న వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే వీళ్లపై 2022లో మంత్రి హత్యకు కుట్ర చేసినట్టు కేసు పెట్టారు. వాళ్లు ఎక్కడుంటున్నారో కనుక్కోవడానికి వారి ఫోన్లు ట్యాప్ చేసి, సినీఫక్కీలో హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని వారు అప్పట్లోనే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
మైహోమ్ కోసం మేళ్లచెరువులో మూడు రోజులు తిష్ట
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మై హోమ్స్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రణీత్ రావు టీమ్ పనిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుడు ఆగస్టు 31న మై హోమ్స్ సిమెంట్ పరిశ్రమ నాలుగో ప్లాంట్ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తున్నవాళ్లను ముందుగానే గుర్తించి అరెస్ట్ చేయడంలో హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మైహోమ్స్ అధినేత రామేశ్వరరావు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అత్యంత సమీప బంధువులు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు టీంలో ఉన్న డీఎస్పీలు తిరుపతన్న, శ్రీనివాస్‌నాయుడు ప్రజాభిప్రాయ సేకరణకు మూడు రోజుల ముందుగానే మేళ్లచెరువులో మకాం వేసి పలువురు ఆందోళనకారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తున్నది.
ట్యాపింగ్ ద్వారా కీలకమైన ఆందోళనకారులను గుర్తించిన పోలీసులు.. రాత్రికిరాత్రే అరెస్ట్‌లు చేసి, ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా జరిగేలా చూశారని అప్పట్లో ప్రచారం జరిగింది. నాటి జిల్లా ఎస్పీకి సమాచారం లేకుండా చేసిన ఈ ఆపరేషన్ అప్పట్లో పోలీస్‌శాఖలో కలకలం రేపింది. హైదరాబాద్ డీఎస్పీ కేడర్ అధికారులకు సూర్యాపేట జిల్లాలో ఎందుకు డ్యూటీ వేశారని స్థానిక అడ్వొకేట్ నాగార్జున ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా తమకు ఆ సంగతే తెలియదని సూర్యాపేట జిల్లా పోలీసులు సమాధానం ఇవ్వడం గమనార్హం.
నల్గొండ జిల్లాలో బై ఎలక్షన్స్కోసం..
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసిన టైంలో ప్రణీత్‍రావు నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని పలు స్టేషన్లలో ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ప్రణీ త్రావు, ప్రభాకర్‌రావు ది ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన కోరుకున్న చోటుకు పోస్టింగ్ఆర్డర్స్ వచ్చేవి. భూపాల్ పల్లి ఏఎస్పీగా పనిచేస్తు న్న భుజంగరావు సొంత జిల్లా సూర్యాపేట. ఈ ముగ్గురితోపాటు ఇప్పటికే అరెస్ట్ చేసిన తిరపతన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు.
వీరిని అడ్డుపెట్టుకొని ప్రభాకర్ రావు జిల్లాలో ఇసుక, లిక్కర్, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక వీరంతా ఎస్ఐబీలో తిష్టవేశాక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ బిగ్షాట్స్ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్లను ట్యాప్చేశారనే ఆరోపణలున్నాయి. హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ నాయకుడు ఎటువైపు పనిచేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ హైకమాండ్‌తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకుచేర వేసినట్టు తెలుస్తున్నది.
పార్టీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తెలిసిన మరుక్షణమే ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడంతో నేతలు హడలిపోయేవారని సమాచారం. దీనికితోడు ప్రత్యర్థుల డబ్బు పంపిణీ కాకుండా ఎక్కడికక్కడ పట్టుకోవడంతో బీఆర్ఎస్ గెలుపు సునాయాసమైందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరిగింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల ముందు సుఖేందర్‌రెడ్డి ప్రతి కదలిక, ఆయన మాట్లాడే ప్రతి మాట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి, అక్కడి నుంచి హైకమాండ్‌కు చేరడం వల్లే సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డికి టికెట్ఇవ్వకుండా పక్కన పెట్టినట్టు సమాచారం.
పర్వతగిరి కేంద్రంగా ప్రతిపక్ష నేతలపై నిఘా
వరంగల్ జిల్లాలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతూరు పర్వతగిరిలో ప్రతిపక్ష నేతల ఫోన్‌ట్యాపింగ్ కోసం ఏకంగా వార్‍రూం ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‍రావు పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు ఈ టాస్క్ నిర్వహించినట్టు తెలుస్తున్నది. ప్రణీత్‍రావు విచారణ సందర్భంగా కొద్దిరోజుల కిందే ఈ విషయం బయటకు వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎర్రబెల్లి తన ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకునేందుకు వార్‌రూమ్‌ను వాడుకున్నట్టు సమాచారం. తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్‌నేత ఝాన్సీరెడ్డి తదితరులు అప్పట్లో ఆరోపించారు. అందుకు తగ్గట్టే ఎన్నికల టైంలో కాంగ్రెస్ నేతల డబ్బు మాత్రమే పట్టుబడటం ఈ ఆరోపణలకు ఊతమిచ్చింది.
ఖమ్మం నాయకుల కదలికలపై ఆరా..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఆ ఇద్దరూ పార్టీ మారుతారనే ప్రచారంతో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్‍రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్న సమయంలో దాదాపు ఆరు నెలల పాటు అనుచరులు, ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో కీలక విషయాలు బయటకు లీకవుతున్నట్టు గుర్తించిన పొంగులేటి తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుమానించారు. దీంతో తన టీమ్‌లోని ముఖ్యనేతలు, అనుచరులు సిగ్నల్ యాప్ మాత్రమే వాడేలా చర్యలు తీసుకున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి.
నా ప్రతి కదలిక ప్రత్యర్థులకు తెలిసేది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నా ఫోన్ కూడా ట్యాప్చేశారు. అప్పట్లో నా ప్రతి కదలిక బీఆర్ఎస్ నేతలకు తెలిసేది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని కొందరుబీఆర్ఎస్వాళ్లు నాతో చెప్పిన గంటల వ్యవధిలో ఆ పార్టీ నేతలు వారితో టచ్‌లోకి వెళ్లారు. బెదిరింపులకు గురిచేసి, కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల్లో మా పార్టీ వ్యూహాలు ఎప్పటికప్పుడు లీక్ అయ్యేవి. కేటీఆర్ పై నేను ఓడిపోవడానికి ఫోన్‌ట్యాపింగే ప్రధాన కారణమని చెప్పక తప్పదు.
–కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, సిరిసిల్ల
పాలమూరులో 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్
బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలనీలోని తన సన్నిహితుడి ఇంట్లో వార్‌రూమ్ ఏర్పాటు చేయించారని, మొదట పలువురు వ్యాపారులను టార్గెట్ చేసి, వారి ఫోన్లను ట్యాప్ చేయించారని సమాచారం. వ్యాపారుల లావాదేవీల వివరాలను రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసేవారని, బెదిరించి భూములు, ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారనే ఆరోపణలు న్నాయి.
కొందరి దగ్గర అతితక్కువ ధరకు భూములను రాయించుకున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి, ఆయన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఘటనలు అప్పట్లో వెలుగుచూశాయి. దీని వెనుక ఫోన్‌ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లోని ఓ పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌ను ఏర్పాటు చేయించి ఓ సీఐ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, సన్నిహితుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా శ్రీనివాస్‌గౌడ్ వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేయించినట్టు తెలుస్తుండగా, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం డీజీపీకి కంప్లైంట్ చేయడం గమనార్హం.