
- మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన స్థానికులు
- వరంగల్ నగరంలో కలకలం
వరంగల్/కాశీబుగ్గ, వెలుగు: బ్యాంకు అధికారులతో కలిసి కొందరు వ్యక్తులు తమను వేధిస్తున్నారంటూ వరంగల్ చౌరస్తాలో ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ చౌరస్తా జేపీఎన్ రోడ్డులోని చెలుపూరు బ్రదర్స్ క్లాత్ స్టోర్ నిర్వాహకులు ఆనంద్, హేమ్ కుమార్ కాజీపేట ఫాతిమా నగర్‍లోని యూనియన్ బ్యాంకులో గతంలో రూ.1.20 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
ఈ లోన్ క్లియర్ చేయలేదంటూ బ్యాంక్ అధికారులు వీరికి సంబంధించిన ఆస్తులను వేలం వేయగా, మడూరి సంపత్ కుమార్ అనే బిడ్డర్ దానిని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సంపత్ ఆ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. శనివారం తన మనుషులతో క్లాత్ స్టోర్ వద్దకు రాగానే ఆనంద్ కుటుంబసభ్యులు వారితో వాదనకు దిగారు. ఆపై ఆనంద్‍తో పాటు ఫ్యామిలీ మెంబర్ తేజస్విని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, పక్కనే ఉన్నవారు వారిని రక్షించారు. గొడవ విషయం తెలుసుకున్న వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, సీఐ షుకూర్ అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని హాస్పిటల్‍కు తరలించారు. అయితే.. ఆనంద్ కుటుంబసభ్యులు మాత్రం బ్యాంకు అధికారులతో కలిసి సంపత్ కుమార్ కుమారులే తమపై దాడి చేశారన్నారు. తాము బ్యాంకులో తీసుకున్న అప్పును వడ్డీతో సహా తిరిగి కట్టామన్నారు. కానీ, గడువు కంటే ముందే సంపత్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులను వారి ఆస్తులుగా చెప్పుకుంటూ వచ్చి తమపై పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంతేజార్‍గంజ్ పోలీసులు తెలిపారు.