
- కొనే స్థోమత లేక ఆలయంలో ఎత్తుకుపోయిన మహిళా భక్తులు
పంజాగుట్ట: చూడండమ్మా.. మీ ఇంట్లో చెడు జరగడానికి కారణం తెలిసింది. దీనికి పరిష్కారం ఏమిటంటే.. మీ ఇంట్లో పంచలోహ విగ్రహాలు పెట్టుకోవాలి’ అంటూ ఓ బాబా తన దగ్గరకు వచ్చిన మహిళా భక్తులకు సలహా ఇచ్చాడు. వాటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియక గుడిలో దొంగతనం చేశారు. ఎస్ఆర్నగర్పరిధిలోని గణేశ్టెంపుల్లో రెండు రోజుల క్రితం జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు.
బంజారాహిల్స్ఎన్బీటీ నగర్‌కు చెందిన అదిరాల స్వర్ణలత(29), జె.పావని(26) ఇండ్లల్లోని కుటుంబసభ్యులు వివిధ కారణాలతో వరుసగా మృత్యువాత పడుతున్నారు. వీరిద్దరూ కలిసి కొద్ది రోజుల కింద ఒక బాబాను ఆశ్రయించారు. పరిష్కారం చెప్పమని అడగడంతో ఇంట్లో పంచలోహ విగ్రహాలు ఉంటే మంచి జరుగుతుందని సలహా ఇచ్చాడు. బయట డబ్బులు పెట్టి కొనే స్థోమత లేకపోవడంతో ఎక్కడైనా గుడిలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.
భక్తుల్లా వచ్చి..
ఈ నెల 8న ఎస్ఆర్ నగర్ గణేశ్ ఆలయానికి స్వర్ణలత, పావని వెళ్లారు. సాయంత్రం వరకు గుడిలో కాలక్షేపం చేశారు. పూజారి పక్కకు వెళ్లగానే ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడిలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను తీసి సంచిలో పెట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఈఓ నరేందర్ రెడ్డి ఫిర్యాదతో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, విగ్రహాలను రికవరీ చేశారు.