ఢిల్లీ రిపబ్లిక్​డే పరేడ్​కు ఇద్దరు మహిళలకు ఆహ్వానం

కాగజ్ నగర్, వెలుగు: ఈ నెల 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్​లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్​కు ఆసిఫాబాద్​ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఆహ్వానం అందింది. వేడుకల్లో పాల్గొనాలని బెజ్జూర్​ మండలం కుకుడ గ్రామానికి చెందిన పోర్తెటి శ్రీదేవి, కౌటాల మండలం కౌటీ అంగన్​వాడీ కార్యకర్త ఎస్.జయంతి రాణికి ఆహ్వానం అందింది.

స్వర్ణిమ్​ భారత్ ​కార్యక్రమంలో భాగంగా పీఎం యశశ్వి స్కీం ​టెక్స్ టైల్​ (హ్యాండీక్రాఫ్ట్స్), డబ్ల్యూసీడీ హ్యాండీక్ట్రాఫ్ట్స్​ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న మహిళల కేటగిరిలో 41 మందికి ప్రత్యేక అతిథులుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్​ ఆహ్వానం పలకగా.. అందులో ఈ ఇద్దరికి చోటుదక్కింది. శ్రీదేవి మండల సమాఖ్య అధ్యక్షురాలితో పాటు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈమె గతంలోనూ ఢిల్లీకి ప్రత్యేక ఆహ్వనితురాలిగా వెళ్లివచ్చారు. అంగన్​వాడీ కార్యకర్త అయిన జయంతిరాణి కొడుకు ఇటీవల పైలెట్​గా ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. తమ ఎంపిక పట్ల ఈ ఇద్దరు ఆనందం వ్యక్తం చేశారు.