భర్తలు వేధిస్తున్నరని..పెండ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

 భర్తలు వేధిస్తున్నరని..పెండ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

లక్నో: తమ తాగుబోతు భర్తలు పెట్టే వేధింపులు తాళలేక విసిగిపోయిన ఇద్దరు మహిళలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి ఒకరినొకరు పెండ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్‌‌లోని గోరఖ్‌‌పూర్‌‌కు చెందిన కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలకు ఇది వరకే పెళ్లిండ్లు అయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే ఈ ఇద్దరూ.. ఇన్‌‌స్టాగ్రామ్‌‌ ద్వారా పరిచయమయ్యారు.ఛాటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. తమ భర్తలు పెడుతున్న వేధింపుల గురించి మాట్లాడుకునేవారు. ఇద్దరి పరిస్థితులు దాదాపు సేమ్ కావడంతో ఫ్రెండ్ షిప్ కాస్తా బాగా ముదిరిపోయింది. 

తమ తాగుబోతు భర్తలు పెట్టే వేధింపులు భరించాల్సిన అవసరం లేదని భావించారు. భర్తలను వదిలేసి తామే కలిసుండాలని మహిళలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ నెల 23న తమ భర్తలను వదిలేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. అదేరోజు సాయంత్రం డియోరియాలోని మినీ కాశీగా ప్రసిద్ధి చెందిన శివాలయంలో ఇద్దరు మహిళలు పెండ్లి చేసుకున్నారు. గుంజా పెండ్లి కొడుకుగా మారి.. కవిత నుదిటిన సింధూరం పెట్టింది.