రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్
  • ఒకరు మృతి, 9 మందికి గాయాలు

మాస్కో: రష్యాపై ఉక్రెయిన్  సోమవారం అర్ధరాత్రి భారీ స్థాయిలో డ్రోన్  అటాక్  చేసింది. ఈ దాడిలో ఓ పౌరుడు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా మిలిటరీ అధికారులు మంగళవారం తెలిపారు. ఉక్రెయిన్ కు చెందిన 337 డ్రోన్లను కూల్చివేశామని రష్యా మిలిటరీ అధికారులు తెలిపారు. తమ దేశంలోని పది ప్రాంతాలపై ఉక్రెయిన్  డ్రోన్లు అటాక్  చేశాయని, వాటన్నింటినీ నేలమట్టం చేశామని వెల్లడించారు. గత మూడేండ్లలో ఇదే అతిపెద్ద డ్రోన్  అటాక్  అని చెప్పారు.

126 డ్రోన్లను కీవ్  వద్ద ఉక్రెయిన్, రష్యా సరిహద్దు సమీపంలో కూల్చివేశాం. 91 డ్రోన్లను మాస్కో ప్రాంతంలో నేలమట్టం చేశాం. అలాగే బెల్గోరోడ్, బ్రయాన్స్‌ క్, వోరోనెజ్  ప్రాంతాలపైనా దాడికి దిగిన డ్రోన్లను కూల్చివేశాం. ప్రధానంగా రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుంటూ దాడికి వస్తున్న 70 డ్రోన్లను నేలమట్టం చేశాం. డ్రోన్  దాడిలో పలు నివాస బిల్డింగులు, చాలా సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.

అలాగే, మాస్కోలోని ఓ బిల్డింగ్  రూఫ్  కూడా డ్యామేజ్  అయింది” అని మాస్కో మేయర్  సెర్గీ సోబ్యానిన్  తెలిపారు. డ్రోన్  దాడి కారణంగా మాస్కో సహా పలు నగరాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన చెప్పారు. అదేవిధంగా మాస్కో ప్రాంతంలో రైళ్ల సర్వీసులను కూడా తాత్కాలికంగా ఆపేశామని వెల్లడించారు. 

అమెరికాతో భేటీకి ముందు దాడి

కాగా.. రష్యాతో యుద్ధం ముగింపుపై సౌదీ అరేబియాలో అమెరికా అగ్ర దౌత్యవేత్తతో ఉక్రెయిన్  ప్రతినిధి మంగళవారం భేటీ కావాల్సి ఉంది. ఈ సమయంలో రష్యాపై ఉక్రెయిన్  డ్రోన్  దాడికి పాల్పడింది. అయితే, ఈ దాడిపై ఉక్రెయిన్  అధికారులు ఇంకా స్పందించలేదు. మరోవైపు నల్ల సముద్రాన్ని కవర్  చేస్తూ కాల్పుల విరమణ, ఖైదీల విడుదల ఒప్పందాన్ని ఉక్రెయిన్  ప్రతిపాదించవచ్చని సమాచారం. ఈ మేరకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఉక్రెయిన్  అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  కూడా ఆసక్తిగా ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.