
- 2 వేల చెట్లు కాలిపోగా.. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం
- ములుగు జిల్లా రామకృష్ణాపూర్ పరిధిలో ఘటన
వెంకటాపూర్( రామప్ప), వెలుగు: గుర్తుతెలియని దుండగులు మామిడి తోటకు నిప్పు పెట్టిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, బాధిత రైతు తిరుపతిరావు తెలిపిన ప్రకారం.. వెంకటాపూర్ మండలం బూరుగుపేట పంచాయతీ రామకృష్ణాపూర్ పరిధిలోని మామిడి తోట సమీపంలోకి సోమవారం ఉదయం 10 గంటల సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అటు వైపు మంటలు రావడం రైతు మొకిరాల తిరుపతిరావు చూశాడు.
మంటలను ఆర్పేందుకు గ్రామస్తుల సాయం కోరేందుకు వెళ్లొచ్చేలోపు మంటలు చెలరేగాయి. దీంతో 2 వేలకు పైగా చెట్లతో పాటు డ్రిప్ పైపులు కాలిపోయాయని బాధిత రైతు వాపోయాడు. సుమారు రూ. 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని విలపిస్తూ చెప్పాడు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపాడు.