యూనియన్ లీడర్లను నమ్ముతలే

రాజకీయ సమీకరణాలు, పార్టీల జోక్యం యూనియన్లను కలుషితం చేశాయి.  కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటూ.. కష్టనష్టాల్లో సంస్థతో పోరాడి హక్కులు సాధించాల్సిన యూనియన్​ లీడర్లు అవినీతి బురదలో కూరుకుపోతున్నారు. ట్రేడ్​యూనియనిజం ఓ వ్యాపారం అయిపోయింది. దీనిని ఆసరాగా తీసుకుంటూ వసూళ్ల పేరుతో  యూనియన్​ నేతలు కార్మికుల రక్తం తాగుతున్నారు. వారి అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తూ.. లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలుస్తున్నారు. 130 ఏండ్ల చరిత్ర గల సింగరేణిలో కొందరు యూనియన్​నాయకుల అవినీతి చర్యలు కంట్రోల్​చేయలేని స్థాయికి చేరుకున్నాయి.

ఎన్నో తరాలను తన కడుపులో దాచుకుని సాకిన సింగరేణిలో ఉద్యోగాల విషయంలో అవినీతి పెరిగిపోయింది. కార్మికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు యూనియన్​ లీడర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వాలు రద్దు చేసిన డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ను ఇన్వాలిడేషన్ ద్వారా లభించే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఫలితంగా ఉద్యోగాలు కార్మికుల పిల్లలకు వస్తున్నాయి. అయితే ఈ విధానంలో కొన్ని లోపభూయిష్ట అంశాలు,  సంపూర్ణంగా అమలు చేసే పద్ధతి లేకపోవడంతో తీవ్రమైన అవినీతి జరుగుతోంది. మెడికల్ బోర్డులో కూర్చునే వారికి సంబంధం ఉందా లేదా తెలియదు కానీ మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికుల నుంచి నాయకులు లక్షల రూపాయల వసూళ్లు చేయడం మాత్రం ఆగలేదు. ఈ వసూళ్ల ను కార్మికుల రక్తం తాగడం కాకుంటే ఏమనాలి. ఇలా ఇన్వాలిడేషన్  కోసం కార్మికులను నిలువు దోపిడీ చేసే వారికి కార్మిక సంఘాల్లో నేతలుగా కొనసాగే అర్హత ఉంటుందా? వారిని కార్మికులు చెమ్మాస్​తో కొట్టే రోజు రాక పోదు. ఈ దోపిడీ  ఆగే పరిస్థితి కానరావడం లేదు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇన్వాలిడేషన్ చేసిన నాడే ఈ అవినీతికి బ్రేక్ పడుతుంది తప్ప వేరే మార్గం లేదు. ఇందులో ప్రతి బోర్డు సందర్భంలో బ్రోకర్లుగా అవతారం ఎత్తిన కొందరు అవినీతి నేతల చేతుల్లో కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కార్మికుల బలహీనతలను వీరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 
పెరిగిన రాజకీయ జోక్యం..
దేశంలోని మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి పోయింది. ప్రజా ప్రతినిధులు, మంత్రుల సిఫార్సు లేఖలు పెరిగాయి. ప్రతీ చిన్న పనికి గని మేనేజర్, ఏరియా జీఎం నుంచి సీఎండీ వరకు సిఫార్సు లేఖలు కోకొల్లలుగా దర్శనం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల, ఔట్ సోర్సింగ్ కార్మికుల పనులకు కూడా సిఫార్సులు కావాల్సిందే. యూనియన్ సెంట్రల్ మొదలు ఏరియా.. పిట్ నేతలదే రాజ్యం. మూడు నుంచి ఐదేండ్ల కోసారి ఓపెన్ కాస్ట్ గనుల్లో కాంట్రాక్ట్ మారుతుంది. కాంట్రాక్టర్ మారినప్పుడల్లా అందులో పని చేసే వారికి సంస్థలో కొనసాగడం సవాల్​గా మారుతోంది. కొత్త ఏజెన్సీ కాంట్రాక్టర్ల పైనే వారి ఉద్యోగం ఉండేది లేనిది ఆధారపడి ఉంటోంది. ఇందులో కొత్తగా రాజకీయ పార్టీల నేతల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు యూనియన్ లలో గుర్తింపు నేతల ప్రెషర్​షరా మాములు అయిపోయింది. 

అసలు ఉద్యోగం నిజంగా అవసరం ఉన్న అర్హులకు కొలువు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనులతో పాటు సివిల్, సెక్యూరిటీ, జైపూర్ వద్ద పవర్ ప్లాంట్ లలో అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన వారి పేరిట కూడా గోల్మాల్ నడుస్తోంది. నిర్వాసితులకు ఉద్యోగాలు దొరకక న్యాయం జరగక ఆగం అవుతున్నారు. ఇందులో యూనియన్ నేతలు,  మధ్యవర్తుల చేతి వాటం అధికమే. గ్యారంటీ లేని ఈ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు వేలలో ఒక్కోసారి లక్షల్లో వసూళ్లు సాధారణమైపోయింది. దీనికి బేరం ఆడుడు కూడా ఉంది. పిట్ స్థాయిలో కొందరు నాయకులు కోటాలు నిర్ణయించుకుని మరీ దందా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. బదిలీ, క్వార్టర్ అలాట్​మెంట్, ప్రమోషన్, ఎక్స్ టెన్షన్ వీటన్నింటికీ రేట్లు ఫిక్స్ చేసుకుని మరీ వసూళ్లు చేస్తున్నారు. 
యూనియన్లను వదలని నేతలు
గుర్తింపు యూనియన్ కొందరికి ఎడిక్షన్ గా మారింది. యూనియన్ ఎన్నికలు సింగరేణిలో రాజకీయ ఎన్నికలు అయిపోయాయి. ఇక్కడ కూడా ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం కార్మిక రంగాన్ని కొందరు నేతలు కలుషితం చేసేశారు. దశాబ్ద కాలం క్రితం వరకు కార్మిక నాయకుడు స్వేచ్ఛగా సీఎండీని కలిసే అవకాశం ఉండేది. డైరెక్టర్లతో కూడా ఇంటరాక్ట్ అయ్యే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.  జీఎంలు మాత్రమే ఇప్పుడు కార్మికులను కలుస్తున్నారు. వారికి సైతం రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్స్ ల రూపంలో ఇబ్బందులు తప్పడం లేదు. అవినీతికి పాల్పడిన వాడి కాలర్ పట్టండి.. చెప్పుతో కొట్టండని గతంలో కార్మిక సమ్మేళనంలో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు చెప్పారు. అవినీతి పనులకు అలవాటు పడిన యూనియన్ నేతలు తమ దోపిడీ వ్యాపారం దెబ్బ తింటుందని యూనియన్ లను విడిచి పెట్టడానికి సిద్ధంగా లేరు. యువ కార్మికులు యూనియన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. వీరిలో కొందరు నేతలు గ్రూప్స్ ను ప్రోత్సహించి ఇబ్బంది పెడుతున్నారు. ట్రేడ్ యూనియన్ రంగంలో రాజకీయాలు జొప్పించి యువత మధ్య చిచ్చు రేపే చర్యలకు పాల్పడుతున్నారు. సెంట్రల్ కమిటీల్లో రిటైర్డ్ ఉద్యోగులుగా ఉన్న నేతలు ఉండటం వరకు సరే.. కానీ ఏరియా రీజినల్ ఇతర కమిటీల్లో రిటైర్డ్ కార్మికులకు ఏం పని అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రొటోకాల్ ​లొల్లి
1998లో సింగరేణిలో యూనియన్ ఎన్నికలు ప్రారంభమైన తరువాత అవినీతి ప్రొటోకాల్స్ లొల్లి ఎక్కువైంది. గుర్తింపు యూనియన్ అంటే అదో గండపెండేరంలా భావించడం స్టార్ట్​ అయింది. ఏరియా పిట్ స్థాయి నుంచి శంకుస్థాపన మొదలు ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కట్టింగ్​ల్లో గుర్తింపు యూనియన్ చోటా మోటా నేతలకు ఆహ్వానం పంపడం, అధికారులు పిలిచినా, పిలవకపోయినా రాజకీయ పార్టీల మాదిరి ప్రొటో కాల్ గొడవలు ప్రారంభమయ్యాయి. గుర్తింపు యూనియన్ నేతలకు తప్ప ఇతర యూనియన్లను పిలవడమే బంద్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే అవినీతి కార్యకలాపాలు పెరిగి పోయాయి. మందు, విందు దావతులు.. డబ్బులు భారీగా చేతులు మారడంతో యూనియన్ నేతలు నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, బ్రాందీ, బార్ షాపులు ఇతర లాభసాటి వ్యాపారాల్లో భాగస్వాములు కావడం మొదలైంది. అలా నేడు కనీసం1000 మందికి పైగా చిన్నా పెద్దా కార్మిక నేతలు యూనియన్లకు అతీతంగా కోట్లకు అధిపతులుగా మారిన దాఖలాలు చూడొచ్చు. 
                                                                                                             - ఎండీ మునీర్,సీనియర్ జర్నలిస్ట్