
- ఒకవర్గం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలను రంజాన్ పండుగ నేపథ్యంలో మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ టైమ్‌లో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది లంచ్ చేసే సమయమని, ఈ టైమ్‌లో పరీక్షలు పెట్టి వారిని ఇబ్బందులు గురిచేయడం సరికాదని చెప్పారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. .
స్కూళ్లు కూడా ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.15 ముగుస్తాయన్నారు. రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి, స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు. ఒక వర్గాన్ని మెప్పించేందుకు, మిగిలిన స్టూడెంట్ల కడుపు మాడ్చడం న్యాయమా అని ప్రశ్నించారు.
రంజాన్‌కు డ్యూటీ మినహాయింపు, బహుమతులు ఇస్తున్నారని, మరి అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు ఇలాంటి మినహాయింపులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శివరాత్రికి హిందువులంతా ఉపవాసం, జాగరణ చేస్తారని, ఆ తర్వాతి రోజు విశ్రాంతి తీసుకుంటారని, అయినా ప్రభుత్వం ఆప్షనల్ హాలీడే ఇవ్వలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని, టీచర్లు స్టూడెంట్లకు ఇబ్బంది లేకుండా టెన్త్ ప్రీఫైనల్ షెడ్యూల్ మార్చాలని డిమాండ్ చేశారు.