4 పథకాలు 561 ఊర్లకేనా? : బండి సంజయ్

4 పథకాలు 561 ఊర్లకేనా? : బండి సంజయ్
  • అర్హులందరికీ స్కీమ్స్ అందించాలి: బండి సంజయ్ 
  • సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉండగా.. నాలుగు పథకాల అమలుకు మండలానికి ఒక గ్రామం చొప్పున 561 ఊర్లను మాత్రమే ఎంపిక చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సంజయ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులుంటే, అందులో 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయలేదు.

10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే, నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయలేదు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. కేవలం 42,267 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడం హాస్యాస్పదం. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు అర్హత ఉన్నప్పటికీ, ఒక్కరికీ ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటు” అని లేఖలో పేర్కొన్నారు. 

ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా ఇప్పటికీ నయాపైసా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. కాగా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో నెల రోజుల పాటు కుంభమేళా జరుగుతుందని, భక్తులు తొందరపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.