ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇండ్లు కూల్చుడా : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఇందిరమ్మ రాజ్యమంటే  పేదల ఇండ్లు కూల్చుడా : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • హైడ్రాపై ప్రభుత్వం మళ్లీ సమీక్షించుకోవాలి

హైదరాబాద్, వెలుగు: పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం మళ్లీ సమీక్షించుకోవాలని సూచించారు. లేకపోతే బీజేపీ తెగించి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు. హైదరాబాద్ బర్కత్​పురాలోని బీజేపీ సిటీ సెంట్రల్ డిస్ట్రిక్ ఆఫీస్​లో ‘సేవా పక్వాడ’ ఫొటో ఎగ్జిబిషన్ ను సంజయ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు మేము అండగా ఉంటాం. మీ ఆస్తులను రక్షించే బాధ్యత తీస్కుంటాం. మీ ఆయుధం మేము అవుతాం. మీ ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు దిగాలంటే.. ముందు బీజేపీ కార్యకర్తలు, మాపై బుల్డోజర్లు దిగాలి. ఆ తర్వాతే మీ ఇండ్లను తాకాలి. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా కొట్లాడేందుకు రెడీగా ఉన్నం’’అని అన్నారు. 

పెద్దోళ్ల జోలికి పోవడం లేదు

రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలపైనే చర్చ జరుగుతున్నదని బండి సంజయ్ తెలిపారు. ‘‘ప్రభుత్వ భూములు ఆక్రమించి భవనాలు కట్టుకున్న పెద్దోళ్ల జోలికి హైడ్రా పోవడం లేదు. పేదల ఇండ్లు మాత్రమే కూలుస్తున్నరు. గృహ ప్రవేశం చేస్తే.. ఆ ఇంటి తోరణాలు వాడకముందే నేలమట్టం చేస్తున్నరు’’అని సంజయ్ మండిపడ్డారు.