తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులకు అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది? : బండి సంజయ్

 తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులకు  అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది? : బండి సంజయ్
  • కరీంనగర్ లో టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, వెలుగు: తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈరోజు జీత భత్యాలు, సమస్యల పరిష్కారానికి అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు.  డీఏలు, పెండింగ్ బిల్లులతో పాటు జీపీఎఫ్ దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు సహా ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేదన్నారు.

 బుధవారం రాత్రి ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని సీతారాంపూర్ లో నిర్వహించిన అధ్యాపక, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి పేరుతో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 

పార్టీ ఫిరాయించిన10 మంది ఎమ్మెల్యేలపై త్వరలోనే అనర్హత వేటు పడటం తథ్యమన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా 7 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, పూలె, సావర్కర్ వంటి యోధులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తుపాకీ లు పట్టుకుని నక్సల్స్ గా తయారు చేసేలా విద్యా వ్యవస్థను తయారు చేయాలని చూస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.  ప్రభుత్వం కులగణన పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి నష్టం చేస్తోందని ఆయన ఆరోపించారు.