
- అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నరు: కిషన్‌రెడ్డి
- గత సర్కారు 8 లక్షల కోట్ల అప్పులు చేసింది.. ఈ సర్కారు అదే పద్ధతిలో పోతున్నది
- అభివృద్ధిపై రేవంత్ సవాల్‌కు నేను రెడీ
- హైదరాబాద్ లో బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నరని ఆరోపణ
ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. , రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరుకుంటున్నదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతున్నదని మండి పడ్డారు. రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పులు తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పోటీచేస్తున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభయహస్తం పేర ఇచ్చిన హామీలు మొండిహస్తంగా మారాయని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. 400 రోజులైనా పూర్తిచేయలేదని మండిపడ్డారు. లిక్కర్ అమ్మకాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నదని, అందుకే లిక్కర్ సేల్స్ కు రూ. 4 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నదని అన్నారు. ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదేండ్లలో వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 14 నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని తెలిపారు.
వాళ్ల ముఖాలు చూసి పెట్టుబడులు రావట్లే
కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ధరలు స్థిరంగా ఉండడంవల్లే పెట్టుబడులు వస్తున్నాయని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముఖాలు చూసి కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 2,300 కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉంటే.. ప్రస్తుతం 5 వేల కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించామని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెచ్చామని తెలిపారు. ఇదంతా ప్రధాని మోదీ చేసిందేనని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, బిల్డర్లను ఎన్వోసీల పేరిట వేధిస్తున్నారని, ఫార్మా కంపెనీలను పొల్యూషన్ పేరుతో కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ కూడా దోపిడీకి పాల్పడుతున్నదని మండిపడ్డారు.