ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్ల నిర్మాణం : కేంద్ర మంత్రి ఖట్టర్

ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్ల నిర్మాణం : కేంద్ర మంత్రి ఖట్టర్
  • తెలంగాణకు.. వాటా కంటే ఎక్కువే మంజూరు చేస్తం: కేంద్ర మంత్రి ఖట్టర్
  • తెలంగాణపై కేంద్రానికి వివక్ష లేదని వెల్లడి

కరీంనగర్, వెలుగు: రాబోయే ఐదేండ్లలో పీఎం ఆవాస్ యోజన కింద దేశంలో మరో 3 కోట్ల ఇండ్లు నిర్మించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని.. అందులో ఈ ఏడాది కోటి ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  కేంద్ర మున్సిపల్, హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువగానే ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘నా ప్రియమైన కరీంనగర్ పౌరులారా.. నమస్తే. ఈ రోజు నేను మిమ్మల్ని పలకరించడానికి ఇక్కడికి వచ్చాను’’ అంటూ తొలుత తెలుగులో తన ఉపన్యాసం ప్రారంభించారు. కరీంనగర్ లోని ఐదు డివిజన్ల పరిధిలోని  2,660 ఇండ్లకు ఇక నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా తాగునీటిని సరఫరా చేయడం చరిత్రాత్మకమైన విజయమన్నారు. జల్  జీవన్ మిషన్ తో దేశంలోని 74 శాతం నివాసాలకు  స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందని, దీంతో దేశవ్యాప్తంగా డయేరియా సంబంధిత మరణాలు మూడు లక్షలకు తగ్గాయన్నారు. ఈ మిషన్ వల్లే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయన్నారు.

 కానీ, మిషన్ భగీరథ పేరుతో ఇదంతా తమ ఘనతేనని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని విమర్శించారు. స్మార్ట్ సిటీ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లిస్తే.. బండి సంజయ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో నిలదీశారని, దీంతో ఆ నిధులను వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించిందన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఖట్టర్ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు.  యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ) ను సమర్పించడంలో జాప్యం చేయడంతోనే  కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతున్నాయన్నారు.  

కరీంనగర్​లో డంపింగ్ యార్డ్ ను ఎత్తేస్తం.. 

కరీంనగర్ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న డంప్ యార్డ్ సమస్యను కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రిదృష్టి తీసుకెళ్లగా.. పరిష్కరిస్తామని ఆయనహామీ ఇచ్చారు. అందుకోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.