ఇంకా 22 సినిమాల్లో నటిస్తా.. వాటి కంటే కేంద్రమంత్రి పదవి ఎక్కువ కాదు: సురేష్ గోపి

 ఇంకా 22 సినిమాల్లో నటిస్తానని చెప్పారు  కేంద్రమంత్రి సురేష్ గోపి. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటిస్తున్నందుకు..  ఒకవేళ తనను పదవిలో నుంచి తొలగిస్తే సంతోషిస్తానని అన్నారు.

కేరళ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మాట్లాడిన సురేష్ గోపి..  సినిమాల్లో నటించేందుకు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి కోరినట్లు  చెప్పారు. ఎన్ని సినిమాల్లో నటిస్తారని ఆయన అడిగితే..  తాను ఇంకా 20 నుంచి 22 సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు  చెప్పానన్నారు. అయితే తన అభ్యర్థనను పక్కకు పెట్టిన అమిత్ షా సినిమాలు చేసేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పారు.    తాను సెప్టెంబర్ 6  నుంచి ఒట్టకొంబం సినిమా షూటింగ్ లో పాల్గొంటానని  చెప్పారు.

తన మంత్రివర్గంలోని ముగ్గురు నలుగురు అధికారులను తీసుకువస్తానని, అటు మంత్రి పదవి నిర్వహిస్తూనే షూటింగ్స్ లో పాల్గొంటానని అన్నారు. తాను కేంద్ర మంత్రిని కావాలని కోరుకోలేదని, ఆ కోరిక ఇప్పటికీ లేదు.. తొలగిస్తే సంతోషంగా పదవి నుంచి తప్పుకుంటా అని సురేశ్ గోపి అన్నారు. తనను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం తాను మంత్రి పదవిని స్వీకరించినట్టు సురేశ్ గోపి చెప్పారు.