- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2కే రన్
యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజాపాలన విజయోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈనెల 9 వరకు నిర్వహించే విజయోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఆదివారం 2కే రన్ నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మండలాల వారీగా స్టూడెంట్స్‌కు 'పునరుత్పాదక వనరులు' అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపినవారికి కలెక్టర్ హనుమంతరావు ప్రశంసాపత్రాలు అందించి మాట్లాడారు.
పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్లవచ్చన్నారు. అనంతరం 2కే రన్‌ను యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సెల్ ఫోన్ వద్దు.. ఆటలే ముద్దు, మహిళలకు వరం.. మహాలక్ష్మి పథకం, రైతుల అండ..- రైతు భరోసా అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో కృష్ణారెడ్డి, కమిషనర్ రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేటలో ..
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2కే రన్ ను అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులకు ప్రభుత్వ ఏడాదిలో సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి రామచంద్రరావు, ప్రిన్సిపల్ శ్రీమన్నారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నల్గొండలో..
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద ప్రజా పాలన విజయోత్సవ 2కే రన్‌ను ఆర్డీవో అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో అధికారులు, వాకర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.