- వాన పడగానే బల్దియా హెల్ప్‌లైన్ నంబర్‌కు వందల్లో కాల్స్
- డీఆర్ఎఫ్ టీమ్స్‌పైనే భారమంతా
- 150 డివిజన్లకు 27 టీమ్స్ మాత్రమే
- ప్రకటనలకే పరిమితమైన మేయర్, అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో అకాల వర్షాలు పడుతున్నా.. ప్రత్యేక చర్య లపై జీహెచ్ఎంసీ నోరు మెదపడం లేదు.10 రోజులుగా వర్షాలు కురుస్తుండగా, ఇంకొన్ని రోజుల పాటు కూడా వానలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మేయర్ కేవలం ప్రకటనలకే పరిమతయ్యారు. కనీసం అధికారులతో సమావేశం కూడా నిర్వహించలేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు పట్టించుకోకపోవడంతో వర్షాలపై గ్రౌండ్ లెవెల్లో అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఆ ఎఫెక్ట్ మొత్తం సిటిజన్లపై పడుతోంది. సాయంత్రం, అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు.
కోటిన్నర జనాభాకు 460 మంది సిబ్బంది
వర్షాలు భారీగా పడుతుండటంతో సహాయక చర్యల కోసం బల్దియా హెల్ప్ లైన్ నంబర్లకి వందల్లో కాల్స్ వస్తున్నాయి. తమ తమ ఏరియాల్లో వచ్చిన సమస్యలను వివరించి పరిష్కరించాలని జనం కోరుతున్నారు. వర్షం పడిన మరుసటి రోజు కూడా రోడ్లపై నీరు తొలగడంలేదు. మాన్సూన్లో మాదిరిగా ఇప్పుడు కూడా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తే కాస్త ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బల్దియా పట్టించుకోవడం లేదు. వానొస్తే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) టీమ్స్‌పైనే భారం పడుతోంది. ఎంతో ఉపయోగపడే ఈ టీమ్స్‌ను కూడా తూతూ మంత్రంగా ఏర్పాటు చేశారు. వర్షాలు కురిస్తే జనం ఇబ్బందులు పడకుండా చూడాల్సిన ఈ టీమ్స్ సిటీలో కేవలం 27 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో మొత్తంగా 460 మంది పనిచేస్తున్నారు. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ టీమ్స్ఉండటంతో తక్షణమే సహాయక చర్యలు అందడం లేదు. ఒక చోట్ల రెస్క్యూ పూర్తయ్యేంత వరకు వేరే ప్రాంత జనం సాయం కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. గ్రేటర్లో 100కు పైగా టీమ్స్ఉండాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు.
ఇబ్బందులపై ఫోకస్ చేయట్లే..
చిన్న వర్షం కురిస్తే డీఆర్ఎఫ్ టీమ్స్ అలర్ట్‌గా ఉండాలని మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ సహా ఉన్నతాధికారులు ఆదేశిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ అసలు సరిపడా బృందాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా డీఆర్ఎఫ్ టీమ్స్ పై దృష్టి పెట్టి మరిన్ని ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో తక్షణమే సహాయక చర్యలు అందే అవకాశం ఉందని సిటిజన్లు చెబుతున్నారు.
డివిజన్‌కు ఓ టీమ్ కావాలి..
డీఆర్ఎఫ్ టీమ్స్ తక్కువగా ఉండటంతో కాల్స్ చేసిన వెంటనే రావడం లేదు. ఆదివారం రాత్రి కురిసిన వానకు యాకుత్‌పురా రైల్వే స్టేషన్ వద్ద 10 ఫీట్ల మేర వాటర్ నిలిచింది. ఫోన్ చేస్తే డీఆర్ఎఫ్ టీమ్ రాలేదు. ఎంతో అత్యవసరమైన ఈ టీమ్స్ సంఖ్య పెంచాలి. కనీసం డివిజన్‌కు ఓ టీమ్ ఉంటే సహాయక చర్యలు వెంటనే అందుతాయి.
- అబ్దుల్ రెహమాన్, సోషల్ యాక్టివిస్ట్
వాకీ టాకీలు ఉండాలి..
ఇటీవల కలాసిగూడ నాలాలో పడిపోయి చిన్నారి చనిపోయినా జీహెచ్ఎంసీలో మార్పు రావట్లేదు. డీఆర్ఎఫ్ టీమ్స్‌ను పెంచితే బాగుంటుంది. తక్షణమే సహాయక చర్యలు అందించేందుకు డివిజన్‌కు ఒకటి చొప్పున 150 టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఫైర్ సర్వీస్, పోలీస్, డీఆర్ఎఫ్ టీమ్స్కలిసి పనిచేసేలా వారికి వాకీటాకీలు అందించాలి.
– రెడ్డన్న, మాజీ ఐపీఎస్ ఆఫీసర్