- 2028–-29 నాటికి ఏటా 43,900 కోట్లకు చేరనున్న ట్రాన్సాక్షన్లు
- రూ. 593 లక్షల కోట్లకు పెరగనున్న ట్రాన్సాక్షన్ల విలువ
- ఆన్లైన్ రిటైల్ పేమెంట్స్‌లో 91 శాతం యూపీఐ ద్వారానే
న్యూఢిల్లీ: దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 13,100 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయని అంచనా. ఈ నెంబర్ 2028–29 నాటికి 43,900 కోట్లకు చేరుకుంటుందని ఫైనాన్స్ కంపెనీ పీడబ్ల్యూసీ ఇండియా రిపోర్ట్ అంచనా వేసింది. మొత్తం ఆన్లైన్ రిటైల్ పేమెంట్స్‌లో యూపీఐ వాటా 91 శాతానికి పెరుగుతుందని తెలిపింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్ గత ఎనిమిదేళ్లలో భారీగా విస్తరించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో జరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ రూ.265 లక్షల కోట్లు ఉంటే, 2028–29 నాటికి ఈ నెంబర్ రూ.593 లక్షల కోట్లకు పెరగనుంది. యూపీఐ ట్రాన్సాక్షన్లు సంఖ్యాపరంగా 2023–24 లో 57 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయి. దేశంలో జరుగుతున్న మొత్తం ఆన్లైన్ రిటైల్ పేమెంట్స్‌లో ప్రస్తుతం 80 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.
పుంజుకుంటున్న క్రెడిట్ కార్డులు..
క్రెడిట్ కార్డుల వాడకం కూడా పెరుగుతోందని పీడబ్యూసీ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.6 కోట్ల కార్డులు ఇష్యూ అయ్యాయి. కొత్త కార్డులు పెరగడంతో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏడాది ప్రాతిపదికన సంఖ్యాపరంగా 22 శాతం, వాల్యూ పరంగా 28 శాతం పెరిగాయి. మరోవైపు డెబి ట్ కార్డుల ట్రాన్సాక్షన్లు సంఖ్యాపరంగా, వాల్యూ పరంగా పడిపోయాయి. దీనిని బట్టి కన్జూమర్ల అలవాటులలో మార్పు కనిపిస్తోందనే విషయం తెలుస్తోంది.
పీడబ్ల్యూసీ ఇండియా రిపోర్ట్ ప్రకారం, దేశంలో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 2028–29 నాటికి 20 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లు, ఇన్నోవేటివ్ ఐడియాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్స్‌ను కొత్తగా ఎలా వాడుకోవచ్చనే విషయంపై రానున్న ఐదేళ్లు పేమెంట్స్ ఇండస్ట్రీ కసరత్తు చేయనుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్ మిహిర్ గాంధీ అన్నారు.
ఆఫ్‌లైన్ పేమెంట్స్, పేమెంట్ డేటా ఆధారంగా డిజిటల్ లెండింగ్ వంటి కొత్తవి మార్కెట్లోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ మర్చంట్లను కేవలం టైర్ 1, 2 సిటీల నుంచే కాకుండా టైర్ 3,4 సిటీల నుంచి విరివిగా జాయిన్ చేసుకుంటాయని పీడబ్ల్యూసీ రిపోర్ట్ అంచనా వేసింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో క్యూఆర్ కోడ్ బేస్డ్ ట్రాన్సాక్షన్లు సంఖ్యాపరంగా 30 శాతం, వాల్యూ పరంగా 17 శాతం పెరిగాయంది.
గ్లోబల్‌గా యూపీఐ, రూపే
యూపీఐ, రూపేను గ్లోబల్‌గా విస్తరిస్తామని, ఇండియాలోని ఫైనాన్షియల్ కంపెనీలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సమర్ధవంతమైన ఫ్రేమ్‌వర్క్‌ను అలవాటు చేసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024 లో ఆయనీ వ్యాఖ్యాలు చేశారు. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), కన్జూమర్ ప్రొటెక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సస్టయినబుల్ ఫైనాన్స్, గ్లోబల్ ఇంటిగ్రేషన్ అండ్ కో–ఆపరేషన్.. ఈ ఐదు అంశాలపై ఫోకస్ పెట్టామన్నారు. క్రాస్ బార్డర్ పేమెంట్స్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తామన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్ , ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు ఇండియా హబ్‌గా మారగలదన్నారు.