- వింటర్ వెకేషన్కు స్వదేశాలకు వెళ్లిన స్టూడెంట్స్, సిబ్బందికి అమెరికన్ వర్సిటీల విజ్ఞప్తి
- ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు చేస్తారనే అనుమానంతో అడ్వైజరీ జారీ
వాషింగ్టన్: వింటర్ వెకేషన్కు స్వదేశాలకు వెళ్లిన, కొత్తగా అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్, సిబ్బంది జనవరి 20లోపు అమెరికాకు తిరిగి రావాలని అక్కడి వర్సిటీలు అభ్యర్థించాయి. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజుకంటే ముందే దేశంలో ఉండాలని కోరాయి. ఈ మేరకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) సహా పలు ఉన్నతస్థాయి విద్యాసంస్థలు అడ్వైజరీలు జారీ చేశాయి.
47వ దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న ట్రంప్.. మొదటి రోజే ఆర్థికం, ఇమ్మిగ్రేషన్ లాంటి అంశాలపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వలసల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకొస్తానని ప్రకటించారు. తన క్యాబినెట్‌లో వలసలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికే ఆ శాఖ పగ్గాలు కూడా అప్పగించారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులు, స్టాఫ్‌కు అమెరికా వర్సిటీలు మార్గదర్శకాలు జారీ చేశాయి.
ఇండియన్స్టూడెంట్స్పై ప్రభావం ఉండదు..
అమెరికాలో ఇప్పటివరకూ 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కాగా, ఇంటర్నేషన్ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్– 2024 నివేదిక ప్రకారం 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇందులో 3 లక్షల 30 వేల మంది ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన 4 లక్షలమంది స్టూడెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్లేకుండా ఉంటున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ అంచనా.
అయితే, అందరూ ఎఫ్ వీసా కలిగి ఉండడంతో.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా బ్యాన్ విధించినా ఇండియన్ స్టూడెంట్స్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ తీసుకొస్తే డాక్యుమెంట్స్లేనివారికి దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఉండబోదని అంటున్నారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ఏడు మెజార్టీ ముస్లిం దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ ప్రయాణికులు 90 రోజులపాటు దేశంలోకి ప్రవేశించకుండా బ్యాన్విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.