ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. యాసంగిలో వరి వేయొద్దని చెప్పి అన్నదాతలను సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. ఇప్పటివరకు ధాన్యం బస్తాలనే కొనుగోలు చేయలేదన్నారు. మిర్చి పండించిన రైతులను కేసీఆర్ కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. కౌలు రైతులకు బ్యాంకు నుంచి లోన్లు రావడం లేదని..దేశంలో పంటల బీమా ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కేంద్రం ఎరువుల ధరలు పెంచడంతో రైతుల ఆదాయం సగానికి పడిపోయిందన్నారు. అన్నదాతలకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పిన కేసీఆర్..వారిని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. వరంగల్ లో జరిగే కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులకు మేలు చేసే అంశాలపై రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి: గీతారెడ్డి
వరంగల్ లో జరిగే రాహుల్ గాంధీ సభకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జనం తరలివస్తారనే నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మెంబర్ షిప్ నమోదు అయ్యిందన్నారు.
మరిన్ని వార్తల కోసం