పోర్టులు, దేశ సంపద అదానీకి దోచిపెడ్తున్నరు: ఉత్తమ్

  • అదానీ అవకతవకలపై మాట్లాడేందుకు మోడీ సిద్ధంగా లేరు: మీనాక్షి నటరాజన్
  • గాంధీభవన్​లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

హైదరాబాద్, వెలుగు: రాహుల్​పై కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వేటు వేసినా.. ఆ కక్షసాధింపు చర్యలపై తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం చేస్తున్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్​పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ గురువారం గాంధీభవన్​లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ​మాట్లాడుతూ.. అదానీ అవకతవకలపై రాహుల్ మాట్లాడితే తట్టుకోలేకే బీజేపీ అనర్హత వేటు వేసిందన్నారు. తీర్పు ఇచ్చిన గంటల వ్యవధిలోనే సస్పెండ్​ చేశారన్నారు. ‘‘నీరవ్ మోడీ రూ.14వేల కోట్లు దోచుకుని బ్యాంక్​లను మోసం చేశాడు. లలిత్ మోడీ బీసీసీఐని మోసం చేసి లండన్ పారిపోయాడు. వీటిపై కాంగ్రెస్ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి గైర్హాజరుకాగా.. రాజీవ్​గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్​ జావేద్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ విధానాలు కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా ఉన్నాయని పేర్కొంటూ రాష్ట్రపతికి వేలాది లెటర్లు పంపనున్నారు.

కుట్రతో సస్పెన్షన్

కొంత మంది పెట్టుబడిదారులకే దేశ సంపదను మోడీ దోచిపెడుతున్నారని మీనాక్షి నటరాజన్​ మండిపడ్డారు. ప్రజా ఆస్తులను అదానీకి దోచి పెడుతుంటే.. ప్రతిపక్ష నేతగా రాహుల్​ నిలదీశారన్నారు. దీనిపై విచారణకు జేపీసీ వేయాలని డిమాండ్​ చేశారని గుర్తు చేశారు. దీనిపై చర్చించేందుకు మోడీ సిద్ధంగా లేరని, అందుకే కుట్ర చేసి రాహుల్​ను సస్పెండ్ చేశారని ఆమె మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, దానిపై పోరాడుతున్న కాంగ్రెస్​కు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలని నదీమ్ జావేద్ కోరారు. రాహుల్​పై బీజేపీ కక్ష పరాకాష్ఠకు చేరిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. రాహుల్ ఇల్లు ఖాళీ చేస్తున్న టైంలో దేశ ప్రజలంతా కంటతడి పెట్టారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దీక్షలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, పంచాయతీరాజ్​ సంఘటన్​ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దేశ్వర్​, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి, మెట్టు సాయి, రోహిన్ రెడ్డి, నూతి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ డుమ్మా

దీక్షకు రేవంత్ రెడ్డి వస్తారని ప్రచారం జరిగినా హాజ రు కాలేదు. తొలుత ఉదయం వస్తారని అనుకున్నా రాలేదు. మధ్యాహ్నం 3గంటల దాకా వస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. అయినా రాకపోవడంతో.. 4 గంటలకు వస్తారని చెప్పారు. ఆయన రావడం లేదన్న సమాచారంతో 5గంటలకు ముగించాల్సిన దీక్షను 4.30 గంటలకే ముగించేశారు. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగ నిరసన దీక్షపై ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మహాత్మ గాంధీ వర్సిటీలో దీక్షకు ప్లాన్ చేశారు. నల్గొండ ఎంపీనైన తనకు చెప్పకుండా దీక్షను ఎట్లా ప్రకటిస్తారని ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో దీక్షను 28కి (శుక్రవారం) వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ దీక్షకు రాలేదేమోనని కొందరు కాంగ్రెస్​ నేతలు అనుకుంటున్నారు.