
- కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్‌లో తేలింది: మంత్రి ఉత్తమ్
- ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యింది
- ప్రాజెక్టును రైతుల కోసం కట్టలే.. వారి జేబులు నింపుకునేందుకు కట్టిన్రు
- బాధ్యులకు శిక్షలు తప్పవు.. ఏ ఒక్కరినీ ఉపేక్షించం
- రిపోర్ట్‌పై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం నిర్మించింది కాదని.. నాటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకోవడానికే కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జేబులు నింపుకున్నా.. నిర్మాణం సరిగ్గా చేపట్టలేద్నారు. కట్టినవాళ్ల టైంలోనే కూలిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారికి శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం హెచ్ఐసీసీలో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్వహణ లోపాలు బయట పడ్డాయని మంత్రి తెలిపారు. ప్రతి స్టేజ్‌లోనూ పూర్ కన్స్ట్రక్షన్ ఉందని రిపోర్ట్‌లో స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టించిందని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి..
కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ సొంత జాగీర్ కాదని.. ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ సహించేది లేదని మంత్రి ఉత్తమ్హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదికతో ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన కాళేశ్వరం నిర్మాణం అంశంపై అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ వెలువరించిన నివేదికే ఇందుకు అద్దం పడుతున్నదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎందుకూ పనికిరాకుండా పోయినా ఆ నిర్మాణాలు తమ గొప్పతనమని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం అధిక వడ్డీలతో లక్ష కోట్లు రుణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను, మన పిల్లల్ని వాళ్ల పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి కట్టారని.. అయినా వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. సిగ్గుపడి.. రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇంత జరిగాక కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై సమగ్రమైన అధ్యయనం చేసి తర్వాత చర్యల కోసం మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.