సంక్రాంతి తర్వాత కొత్తగా 10 లక్షల స్మార్ట్​ రేషన్ కార్డులు

సంక్రాంతి తర్వాత  కొత్తగా 10 లక్షల స్మార్ట్​ రేషన్ కార్డులు
  • మండలిలో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రకటన
  • కొత్త  కార్డుల కోసం కులగణన డేటానూ పరిశీలిస్తం
  • త్వరలో రేషన్​ షాపుల ద్వారాసన్నబియ్యం పంపిణీ
  • పదేండ్లలో బీఆర్​ఎస్​ ఇచ్చింది 49వేల కార్డులేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేసే ప్రక్రియను ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా పది లక్షల రేషన్ కార్డుల మంజూరయ్యే అవకాశం ఉందని,  దాదాపు 31 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, కొత్తగా ఇచ్చే రేషన్​కార్డులను స్మార్ట్ కార్డులుగా రూపొందించి జారీ చేస్తామని తెలిపారు.  సోమవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్​ కోదండరాం, జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్​, తక్కళ్లపల్లి రవీందర్​రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానాలు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం కులగణన సర్వేను కూడా ఆధారం చేసుకుంటామన్నారు.


కొత్త కార్డులతో ప్రభుత్వంపై అదనంగా రూ.956 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు గాను మీ సేవ కేంద్రం ద్వారా పదేండ్లుగా వచ్చిన 18 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డుల విధివిధానాల కోసం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్​ సబ్​కమిటీ వేశారని, కమిటీ పలుమార్లు సమావేశమై సిఫారసులను కేబినెట్ ఆమోదం కోసం పంపించిందని వివరించారు

పదేండ్లలో ఇచ్చిన రేషన్​ కార్డులు 49 వేలే

గత బీఆర్​ఎస్​ పాలనలో పదేండ్లలో 2014 నుంచి 2023 డిసెంబర్​ వరకు  మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులు 49 వేలు మాత్రమేనని, ఈ కార్డుల లబ్ధిదారులు 86 వేల మంది అని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో  91 లక్షల 68 వేల 231 రేషన్ కార్డులు ఉంటే  లబ్ధిదారులు  3.38 కోట్ల మంది ఉండేవారని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ వాళ్లు వెళ్లిపోవడంతో 2 లక్షల 46 వేల 324 రేషన్ కార్డులు రద్దయ్యాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక  89 లక్షల 21 వేల 907 తెల్ల రేషన్ కార్డులు, 2.70 కోట్ల లబ్ధిదారులు ఉండేవారన్నారు. 2016 నుంచి 2023 వరకు కొత్తగా 20 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేశారని తెలిపారు. ఇదే టైంలో 19 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి 5,98,000 ఆహార భద్రత కార్డులు తొలగించారని మంత్రి పేర్కొన్నారు.  

రేషన్​ ద్వారా సన్నబియ్యం

గ్రామ పంచాయతీలు, గిరిజన తండాల్లో, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రేషన్​ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్​ వివరించారు.  రేషన్​ షాపుల్లో ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవ్వరు తినక పోవడంతో పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఇప్పటి వరకైతే లేదని, ఏదన్నా ఉంటే కేబినెట్ ముందు పెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు.