HRCని ఆశ్రయించిన 10వ తరగతి విద్యార్థి

HRCని ఆశ్రయించిన 10వ తరగతి విద్యార్థి

కర్నూలు: తన స్కూల్ హెడ్‌మాస్టర్, స్కూల్ సిబ్బంది పొరపాటు వల్ల తనకు మార్క్స్ మెమో రాకపోవడంతో ఆందోళనకు గురైన పదో తరగతి విద్యార్థి మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించాడు. తన తండ్రిని వెంట బెట్టుకుని మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. 
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థి వడ్డేపల్లి గొల్ల వంశీ కి మార్క్స్ మెమో రాలేదు. తనతోటి విద్యార్థులందరికీ మెమోలు వచ్చినా తనకు రాకపోవడంతో స్కూల్ ఉపాధ్యాయులను, హెడ్మాస్టర్ ను సంప్రదించాడు. వారు ఎలాంటి జవాబు ఇవ్వకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒక వైపు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుతుంటే తనకు మార్క్స్ మెమో ఇవ్వకపోవడం వల్ల కాలేజీలో చేరే అవకాశం చేజారిపోతోందని ఆందోళనకు గురైన విద్యార్థి తన తండ్రితో కలసి హెచ్చార్సీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. 
పాఠశాలలో జరిగిన పొరపాటు వల్లే విద్యార్థికి అన్యాయం జరిగిందని గుర్తించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఈ సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ తెలిపారు. విద్యాశాఖ అధికారులు కాలయాపన చేస్తుండడం వల్ల విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అందుకే విద్యార్థిని వెంటబెట్టుకుని హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు. విద్యార్థి విషయంలో తప్పిదాలు చేసిన హెచ్ఎంలు శరభయ్య, రమణయ్య, క్లర్క్ సయ్యద్ తర్భేజ్‌లపై చర్యలు తీసుకుని విద్యార్థికి మార్క్ మెమో ఇప్పించి న్యాయం చేయాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

స్పందించిన విద్యాశాఖ అధికారులు
టెన్త్ మార్కుల జాబితా కోసం విద్యార్థి హక్కుల కమిషన్ కు ఆశ్రయించిన ఘటనను బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు జయపాల్, జగదీష్ బాబు, సంజీవ, శేఖర్ తదితరులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించారు. హక్కుల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు ప్రతి తమకు అందిన వెంటనే సంబంధిత పాఠశాల రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించామని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి, టెన్త్ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సులోచన తెలిపారు. విద్యాశాఖ ఉన్నత అధికారుల సూచనల మేరకు విద్యార్థికి న్యాయం చేస్తామని తెలిపారు.