ముగిసిన వాగ్గేయకారోత్సవాలు

ముగిసిన వాగ్గేయకారోత్సవాలు
  •  రామయ్యకు అభిషేకం.. నేడు హుండీ లెక్కింపు

భద్రాచలం, వెలుగు :  భక్తరామదాసు జయంతి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఐదు రోజుల పాటు జరిగిన వాగ్గేయకారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత కళాకారులు రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలను ఆలపించి భక్తులను అలరించారు. ముఖ్యంగా వెంకటనారాయణ అనే కళాకారుడు మురళీగానం చేస్తూ వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించిన తీరుతో భక్తులు తన్మయం చెందారు. 

అంతకు ముందు ఉదయం గర్భగుడిలో సీతారాములకు సుప్రభాత సేవ అనంతరం ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. సాయంత్రం దర్బారు సేవ జరిపారు.  గురువారం  సీతారాముల హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.