ముక్కోటి వైభవం..వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల భక్తులు నగర సంకీర్తనలు చేశారు. - వెలుగు, నెట్ వర్క్
వైభవంగా వీరభద్రుడి కల్యాణం..
కొత్తకొండ వీరభద్రుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణం చేశారు. అంతకుముందు నందీశ్వరుడి చిత్రపటంతో అర్చకులు ధ్వజరోహణం చేశారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెళ్లి చంద్రశేఖర్ గుప్తా దంపతులు, ఆలయ ఈవో కిషన్ రావు, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహా మూర్తులను, పట్టువస్ర్తాలు, తలంబ్రాలను పండితుల ఆధ్వర్యంలో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. గోధూళి ముహూర్తాన భద్రకాళీ సమేతా వీరభద్రుడి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట్నారాయణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – భీమదేవరపల్లి, వెలుగు