రోడ్డెక్కిన కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి విద్యార్థులు

యాదాద్రి : తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామస్తులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఇప్పటి వరకూ కూడా బస్సు సౌకర్యం లేదని ఆందోళన చేశారు. ఆలస్యంగా స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని చెప్పారు. గజ్వేల్, భువనగిరి ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నాయకులు బైఠాయించి.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బస్సు సర్వీస్ లు సరైన సమయానికి నడపాలని కోరారు. 

గత ఏడాది జూన్‌ 22న వాసాలమర్రికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గ్రామస్తులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సంగతి తెలిసిందే. గతంలో వాసాలమర్రికి వెళ్లినప్పుడు.. 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు.