
- వచ్చే నెల 6న రాములోరి కల్యాణం
- ఘనంగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 30 నుంచే ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. వచ్చే నెల 6న శ్రీసీతారాముడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై రెండు రోజుల కింద ఆర్డీవో నేతృత్వంలో అన్ని శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎనిమిదిరోజుల పాటు శ్రీ రామ నవమి ఉత్సవాలు కొనసాగనున్నాయి.
ప్రతిరోజు ఉదయం రాజన్నతోపాటు సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఎనిమిది రోజులు ఉదయం 8.30 గంటల తర్వాతనే భక్తులకు అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఉదయమే స్వస్తి పుణ్యాహవాచనం, స్వామివారికి అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10.40గంటలకు పంచాంగ పూజ, సాయంత్రం 4:00 గంటలకు పంచాంగ శ్రవణం, పండిత సన్మానం నిర్వహించనున్నారు.
రాత్రి సమయంలో ఉత్సవమూర్తులను పెద్దదేవపై ఊరేగించనున్నారు. 6న సీతారామచంద్రస్వామి దివ్య కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా కోడెమొక్కులు మినహా అభిషేకాలు, అన్నపూజలు, నిత్యకల్యాణం, కుంకుమ పూజలు, లింగార్చనలు, సత్యనారాయణ వ్రతాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కల్యాణ అనంతరం రాత్రి రథోత్సవంతోపాటు, డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా తరలిరానున్న భక్తులు
రాజన్న ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 50వేల నుంచి లక్ష మంది వరకు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కల్యాణం అనంతరం సీతారాముల ఉత్సవమూర్తులకు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ కల్యాణానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి శివపార్వతులు, జోగినులు రాజన్న సన్నిధికి చేరుకుంటారు. ఓ వైపు సీతారాముల కల్యాణం జరుగుతుంటే మరొకవైపు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహమాడుతూ తన్మయత్వంచెందుతారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
సీతారాముల కల్యాణం తిలకించేందుకు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. వేసవి నేపథ్యంలో భక్తులకు తాగునీటితోపాటు మజ్జిగ ప్యాకెట్స్అందుబాటులో ఉంచుతున్నాం. చలువ పందిళ్లు, కల్యాణం వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్స్, కూలర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నాం. భక్తులకు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. - వినోద్‌రెడ్డి, రాజన్న ఆలయ ఈవో