రూ. 6 కోట్లు తగ్గించినా.. ముందుకురాని కాంట్రాక్టర్లు

రూ. 6 కోట్లు తగ్గించినా.. ముందుకురాని కాంట్రాక్టర్లు
  •  వేములవాడ రాజన్న ఆలయంలో 
  • మరోసారి తలనీలాల వేలం పాట 
  • రూ. 14 .01 కోట్లకు పాడిన సికింద్రాబాద్ కళావతి ఎంటర్​ ప్రైజెస్​ 
  • నివేదికను ఎండోమెంట్ కమిషనర్ కు పంపిన ఆలయ అధికారులు

వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల టెండర్ ధర మరోసారి ఆశించిన స్థాయిలో రాలేదు. రెండేండ్ల కింద టెండర్ రూ. 19. 08కోట్లకు పాడగా.. ఈసారి రూ. 6 కోట్లు తగ్గించి ఆలయ అధికారులు వేలం వేశారు. అయినా.. కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గురువారం ఆలయ ఓపెన్​స్లాబ్​లో తలనీలాల టెండర్​వేలం పాట వేశారు. ముందుగా రూ. 13.70 కోట్లతో అధికారులు వేలం ప్రారంభించారు. సికింద్రాబాద్ కు చెందిన వల్లభ ఎంటర్​ప్రైజెస్ రూ. 14 కోట్లకు, కళావతి ఎంటర్​ప్రైజెస్​రూ.14. 01 కోట్లకు వేలం పాడాయి. దీంతో టెండర్​వివరాలను స్టేట్ ఎండోమెంట్​కమిషనర్ కు నివేదిక పంపినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

కాగా.. ఈనెల11న వేలంలో తమిళనాడుకి చెందిన దురై ఎంటర్ ప్రైజెస్​రూ.13.67 కోట్లకు ఆన్ లైన్ లో టెండర్ వేసింది. కానీ దక్కించుకోలేదు. మరోసారి అదే టెండర్ పాటపై అదనంగా 30 లక్షలు పెంచి పాడారు.  కాగా.. కాంట్రాక్టర్లలంతా రింగ్ అయి టెండర్​ను తగ్గిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు టెండర్లలో పాల్గొనకుండా తగ్గించేందుకు దేవాదాయ శాఖ అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేలం పాటలో ఈఓ వినోద్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్​కుమార్, ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు.