బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

తన బహువిధ రచనా ప్రక్రియల ద్వారా, నిద్రావస్థలో ఉన్న తెలుగు జాతిని జాగృతం చేసిన వైతాళికుల్లో సురవరం ప్రతాపరెడ్డి ఎన్నదగినవారు. 1896 మే 28న ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా అలంపూర్​తాలూకా బోరువెల్లి గ్రామంలో జన్మించిన ఆయన.. గోల్కొండ పత్రిక సంపాదకులుగా, సమాజ సేవకుడిగా, బహుగ్రంథకర్తగా, భాషా పరిశోధనల ద్వారా ఆంధ్రుల సంస్కృతిని పరివ్యాపితం చేసిన ప్రయోక్తగా తెలుగుజాతికి చిరపరిచితులు. కానీ, అనేక కారణాల వల్ల ఆయనకు నిజంగా రావాల్సినంత ఖ్యాతి దక్కలేదేమో అనిపిస్తుంది. అందుకు, స్వతస్సిద్ధమైన ఆయన స్వభావం కూడా కొంతవరకు కారణమై ఉండొచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన ప్రచారం కోసం అర్రులు చాచింది ఎప్పుడూ లేదు. సాధికారికంగా ఆయన చెప్పే ప్రతి అంశంలోనూ నిశిత పరిశీలనా –- పరిశోధనా దృష్టి, లోతైన విషయ పరిపక్వత వాటన్నింటికీ మించిన మానవీయత–-నిజాయతీ తొణికిసలాడుతుంటాయి. ప్రచార కండూతి ఏ కోశానా కనిపించదు. కారణం ఏదైనా, సురవరం ప్రతాపరెడ్డికి అర్హమైన హేతుబద్ధమైన స్థానం కల్పించకపోవడం వల్ల ఆయన నష్టపోయినదానికన్నా తెలుగు జాతి నష్టపోయిందే ఎక్కువ. రాజకీయ, సాహిత్య, సంగీతాదిరంగాల్లో తెలుగునాట లబ్ధప్రతిష్టులైన 75 మంది నాటి ప్రముఖ ‘పెన్​పోర్​ట్రెయిట్స్’ను 1959–61లలో ఆంధ్ర సచిత్ర వార పత్రికల్లో ధారావాహికంగా ప్రచురించారు. అందులో సురవరం ప్రతాపరెడ్డి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి చోటుదక్కకపోవడం విచిత్రం.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర

గోల్కొండ పత్రికలో ఆయన రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతర సమకాలీన పత్రికల్లో వివిధ అంశాలపై ప్రచురితమైన వ్యాసాలు, రచనలు ఆయా కాలమాన పరిస్థితుల్లో సమాజాన్ని, మానవ సమూహాల్ని జాగృతం చేసిన  చైతన్యపు రస గుళికలే. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘికచరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గోల్కొండ కవుల సంచిక.. ఇవన్నీ ఆయనలో నిబిడీకృతమై ఉన్న పరిశోధనా తపనను, భాషా సాధికారతను, విషయావగాహనను, ప్రజ్ఞను, విశాల దృక్పథాన్ని తేటతెల్లం చేసేవే. రాజులు, రాజరికాలు, వారి జీవన విలాసాలు, విలాపాలు, వర్ణనలు, పొగడ్తలు– తెగడ్తలు కాకుండా సామాన్యుని జీవితాల్ని ప్రతిబింబించే ఆంధ్రుల సాంఘిక చరిత్ర లాంటి గ్రంథాలు చరిత్ర గతిలో చాలా అరుదు. కృష్ణశర్మ స్వయంగా, ‘స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఆంధ్ర సాహిత్యములో వెలువడిన అనర్ఘగ్రంథాలు కొన్నింటిలో ఈ గ్రంథము అగ్రగణ్యమని నమ్ముతాన’న్నారు. అటువంటి సాహితీ, సామాజిక సేవ ప్రతాపరెడ్డిది. హేతుబద్ధమైన సాంప్రదాయిక విలువల్ని గౌరవిస్తూనే ఆధునికత వైపు ఆచితూచి అడుగులు వేసిన సాహసి ప్రతాపరెడ్డి. ప్రాచీన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలోని సంబద్ధతను, శాస్త్రీయతను ఆధార సహితంగా విశ్లేషించి తెలుగు జాతికి ఎంతో మేలు చేశారాయన. నిరాధారమైన మూఢ విశ్వాసాలను నిర్ద్వంద్వంగా నిరసించారు. '

నిజాం హెచ్చరికలు ఖాతరు చేయలే..

సురవరం ప్రతాపరెడ్డి బహుభాషాకోవిదులు. తెలుగుతోపాటు సంస్కృతం, ఆంగ్లం, పార్శీ, ఉర్దూ భాషల్లో అపార జ్ఞాన సంపన్నులై ఉండి తెలుగులో లోతైన పరిశోధనలు చేశారు. ఆనాటి ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపైన, సమస్యలపైన ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేది. దాన్ని ఆయన తన గోల్కొండ పత్రికలో ప్రతిబింబించడమే కాకుండా పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేసేవారు. ప్రజలపై ప్రభుత్వ నిర్బంధానికి ప్రతీకగా ఆ రోజుల్లో అమలవుతున్న గష్తీ నిషాన్​–53ను తీవ్రంగా నిరసించిన ప్రతాపరెడ్డి ఒక సందర్భంలో దాన్ని ప్రస్తావిస్తూ..‘‘వాగ్బంధన శాసన శృంగార తాండవ క్రీడా విశేషం”అని చమత్కరించారు. ప్రజా సమస్యలపై గోల్కొండ పత్రికలో వచ్చే సంపాదకీయాలనుటంకిస్తూ నాటి నిజాం ప్రభుత్వం నుంచి అప్పుడప్పుడు హెచ్చరికలు వచ్చినా వాటిని ఆయన ఖాతరు చేసే వారు కాదు. భవిష్యత్​ వికాసానికి అవకాశమున్న న్యాయవాద వృత్తిని వీడి, వ్యవసాయాన్ని కాదనుకుని, ఉద్యోగావకాశాల్ని  వదిలి.. విశాల జనహితానికి సేవ చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన ఆయన, ఆంధ్రోద్యమ వ్యాప్తికి కృషి చేశారు. తెలుగు సంస్కృతికి టీకా తాత్పర్యం చెప్పిన మరో మల్లినాథ సూరిగా ఆయనను అభివర్ణిస్తుంటారు. ఆంధ్ర సారస్వత పరిషత్​ స్థాపకుల్లో ఒకరుగా, విజ్ఞాన పరిషత్​ స్థాపక చైర్మన్​గా, ఆయుర్వేద సంస్థకు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. జాతి సేవకు రాజకీయాధారం అవసరం, ఆలంబనని బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి వంటివారు బలవంత పెట్టడం వల్ల రాజకీయాల్లోకి వచ్చి వనపర్తి నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తనకున్న సహజసిద్ధమైన సేవా దృక్ఫథానికి, రాజకీయాల్లో ఉండే వాస్తవిక పరిస్థితికి పొంతన కుదరదని ఆయన కొద్దికాలంలోనే గ్రహించగలిగారు.  ఎదిగిన కొద్దీ ఒదగమనే పెద్దల నానుడికి అసలు సిసలైన ఉదాహరణ మన సురవరం ప్రతాపరెడ్డి.

గోల్కొండ పత్రికతో.. 

ప్రతాపరెడ్డి సహజంగానే సంఘ సంస్కరణాభిలాషి, అందువల్లే ఆయన సమకాలీనమైన అనేక సాంఘిక అంశాలపైన గోల్కొండ పత్రికలో సంపాదకీయాలు రాసి ఎప్పటికప్పుడు జనాన్ని సమాచారయుతుల్ని, చైతన్యవంతుల్ని చేయడం తన కర్తవ్యంగా భావించారు. నాటి ప్రముఖ పత్రికలైన ఆంధ్రపత్రిక(చెన్నపురి), కృష్ణాపత్రిక(మచిలీపట్నం)లకు దీటుగా ఆ పత్రికను నడిపారాయన, గోల్కొండ పత్రికను స్థాపించి సమర్థంగా, ప్రభావకరంగా నిర్వహించడానికి మించిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహితీ కృషి ఇంకేముంటుంది. పౌరహక్కులు, సంఘ నిర్మాణం, మత సామరస్యం, ఐక్యత వంటి ఆదర్శభావాలకు తోడు రాష్ట్ర ప్రగతి, భాషా వికాసం, మాతృభాషాభివృద్ధి, బాలిక విద్య, హాస్టళ్ల సమగ్ర నిర్వహణ, గ్రంథాలయాల అభివృద్ధి వంటి విషయాల్లోనూ ప్రతాపరెడ్డి అభ్యుదయవాది అని నిర్ధారించేవిగా ఆయన సంపాదకీయ రచనలు ఉండేవి. తమ రాతలు ఒక్కోసారి నిజాం ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయని తెలిసినా, అది సమాజ హితంలో తప్పనిసరిగా వెల్లడించాల్సిన అభిప్రాయమైతే గోల్కొండ పత్రికగాని, ప్రతాపరెడ్డిగాని వెనుకాడే వారు కాదు. 

- సవ్యసాచి