కొంతమంది తినడానికి కూడా టైం లేకుండా బిజీ లైఫ్ గడుపుతుంటారు. ఎప్పుడో ఆకలి అనిపిస్తే .. ఆ ప్రాంతంలో లభించే పదార్దాలను పొట్టలోవేసి ఆకలి చంపుకుంటారు. ఇది ఇప్పుడు బాగున్నా.. రోజు తినాల్సిన టైంలో తినకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు రోజుకు ఎన్ని సార్లు ఆహారం తీసుకోవాలి.. ఏ టైంలో తినాలి.. మరి ఆ వివరాలను తెలుసుకుందాం. . . .
హైటెక్ యుగంలో జనాలు బిజీ బిజీగా గడుపుతున్నారు. తినడానికి.. తాగడానికి టైం లేకుండా చేతిలో ల్యాప్‌ట్యాప్ పట్టుకొని ఆఫీసు పనిలో నిమగ్నమవుతున్నారు. అయితే రొటీన్ లైఫ్‌లో తినడానికి కూడా సమయానికి కేటాయించకపోతే త్వరగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు.
చాలామంది యువత ఈ రోజుల్లో సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. ఉరుకులు పరుగులతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అంటూ హడావిడిగా వెళుతుంటారు. ఈ తరుణంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా అనారోగ్యం బారిన పడుతుంటారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలోని శక్తి కోల్పోతారు.ఇలా ప్రస్తుతం చాలా మంది ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే తినడానికి సరైన సమయం కేటాయించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతీ రోజూ మూడు పూటలా తినే ఆహారాన్ని సమయానికి తీసుకోవాలట. అందులోను ఏ ఒక్కపూట కూడా ఆహారాన్ని తినకుండా ఉండకూడదట. ముఖ్యంగా ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ సమయానికి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ ను 7 గంటల నుంచి 8 గంటల మధ్యే తినేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాల లోపే ఖాళీ కడుపుతో ఉండకుండా అల్పాహారం తీసుకోవాలట. ఇక మధ్యాహ్నం తీసుకునే భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2 గంటల మధ్యలోనే తినేయాలట.
ఎప్పుడైనా మధ్యాహ్న భోజనం సాయంత్రం 4 గంటల తర్వాత అసలు తినకూడదు. ఎందుకంటే సమయం దాటిని తర్వాత ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక రాత్రి తీసుకునే ఆహారాన్ని సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలోనే తినేయాలి. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన సమయాల్లోనే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.
అల్పాహారం, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే..
భోజనం సరిగ్గా జీర్ణం కావడానికి 3-4 గంటలు పడుతుంది. అందువల్ల, రెండు భోజనాల మధ్య గ్యాప్ 4 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంతకంటే ఎక్కువ గ్యాప్ ఎసిడిటీకి దారి తీస్తుంది. భోజనం మధ్య మీరు తప్పనిసరిగా స్నాక్స్, పండ్లు తినాలి. మీరు మీ అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం మధ్య కనీసం 2 స్నాక్స్ తీసుకోవాలి.
సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల.. మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. పైగా ఇది జంక్ ఫుడ్ తినే కోరికను పెంచుతుంది. అంతేకాకుండా ఇది ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. మగ, ఆడ వారిలో కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. ఆడవారిలో పిసిఒఎస్, పిసిఒడి, పీరియడ్స్ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి టైమ్‌కి తినండి. మనం కష్టపడేది.. తిండి, మనుగడ కోసమే కాబట్టి.. సమయానికి భోజనం చేయండి. కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెతను మర్చిపోకండి..హెల్తీగా లైఫ్‌ని లీడ్ చేయండి ..