
పారిస్: ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న ఒలింపిక్ పతకం లేకుండానే ఇండియా తరఫున తన కెరీర్‌ను ముగించాడు. ఎన్నో ఆశలలో మూడోసారి ఒలింపిక్స్‌కు వచ్చిన బోపన్న పారిస్‌లో తొలి రౌండ్ కూడా దాటలేకపోయాడు. సోమవారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–శ్రీరామ్ బాలాజీ 5–7, 2–6తో వరుస సెట్లలో ఫ్రాన్స్‌కు చెందిన రోజర్ వాసెలిన్–గైల్ మోన్‌ఫిల్స్ జంట చేతిలో ఓడిపోయాడు. ప్రత్యర్థులు మారుతూ... రెండు రోజులు వాయిదా పడిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట అంచనాలను అందుకోలేకపోయింది. తొలి సెట్‌లో పోరాడిన ఇండియన్స్ రెండో సెట్‌లో పూర్తిగా తేలిపోయారు. ఇండియా తరఫున తనకిదే ఆఖరి మ్యాచ్ అని బోపన్న ప్రకటించాడు.
1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ బ్రాంజ్ గెలిచిన తర్వాత 2016లో బోపన్న కూడా పతకం అంచుల వరకు వచ్చాడు. మిక్స్‌డ్‌లో సానియాతో కలిసి బరిలోకి దిగిన బోపన్న బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓడి నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ‘దేశం తరఫున ఇది నా చివరి ఈవెంట్‌గా నిలిచిపోతుంది. నేను ఏ స్థాయిలో ఉన్నానో అర్థమైంది. ఇక నుంచి వీలైనంత వరకు టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదిస్తా. దేశం తరఫున ఇంతవరకు రావడం నాకు బోనసే. రెండు దశాబ్దాలుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 2002లో నా అరంగేట్రం నుంచి 22 ఏండ్లుగా ఇండియా ఆడటం చాలా గర్వంగా అనిపిస్తోంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. ఇప్పటికే బోపన్న డేవిస్ కప్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.