
వెలుగు, నెట్వర్క్ : జిల్లావ్యాప్తంగా కనుల పండువగా కామదహనం, హోలీ సంబురాలు జరిగాయి. పల్లెలు, పట్టణాల్లోని వీధుల్లో బాజాభజంత్రీలతో కాముడిని ఊరేగించారు. ప్రధాన కూడళ్ల వద్ద కామదహనాలు చేశారు. మహిళలు కాముని చుట్టూ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహించారు. అనంతరం చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుని హోలీ పండుగను షురూ చేశారు. బాల్కొండ, లింగంపేట, బోధన్, పిట్లం, నిజామాబాద్ పట్టణం, కామారెడ్డి జిల్లాకేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
హోలీ వేడుకల్లో అల్లర్లకు తావులేదు
నిజామాబాద్, వెలుగు : హోలీ పండగను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఇష్టంలేని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లడం, కలర్వాటర్ పోయడం చేయవద్దన్నారు. ఆసక్తిలేనివాళ్లను హోలీ సంబురాల్లోకి లాగొద్దన్నరు. గురువారం తన ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులకు గురిచేయొద్దని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే హోలీ నిర్వహించుకోవాలని సూచించారు. బైక్‌లతో ర్యాలీలు, సౌండ్ పొల్యూషన్ అనుమతి లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు.