నర్సింగ్ హోమ్ ముందు ఆందోళన

నర్సింగ్ హోమ్ ముందు ఆందోళన

శివ్వంపేట, వెలుగు: ఆసుపత్రిలో సరైన వైద్యం అందించకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్  ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. శివ్వంపేటలో నర్సింగ్ హోమ్  పేరుతో హాస్పిటల్  నిర్వహిస్తుండగా, అందులో ఆర్ఎంపీ  వైద్యం చేస్తున్నాడని ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు గ్రామానికి చెందిన బోయిని బిక్షపతి యాదవ్  ఈనెల 3న అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి పక్కనే ఉన్న శ్రీసాయి నర్సింగ్ హోమ్ లో చికిత్స చేయించుకోవడానికి వెళ్లాడు. 

భిక్షపతికి డాక్టర్  ఒకేసారి ఏడెనిమిది టాబ్లెట్లు వేసి, మూడు, నాలుగు సెలైన్  బాటిళ్లను ఎక్కించారని ఆరోపించారు. ఇంటికి వచ్చిన భిక్షపతి ఆరోగ్యం విషమంగా మారడంతో అదే రాత్రి హైదరాబాద్ లోని ప్రైవేట్  ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్  పరీక్షించి, వైద్యం వికటించడంతోనే అతను చనిపోయినట్లు  తెలిపారని బాధితులు చెప్పారు. సరైన వైద్యం అందించకపోవడంతోనే తమ తండ్రి చనిపోయాడని కొడుకులు బోయిని మహేశ్, శ్రీశైలం, సురేశ్​ ఆరోపించారు.