రేపు తెలంగాణను పాలించే గుమ్మం.. ఖమ్మం : వైఎస్ విజయమ్మ

ఖమ్మం : షర్మిలకు ఎన్ని నిర్బంధాలు పెట్టినా పాదయాత్ర కొనసాగిస్తుందని వైఎస్ విజయమ్మ అన్నారు. రేపటి రోజున తెలంగాణను పాలించే గుమ్మం.. ఖమ్మం అన్న ఆమె.. షర్మిల అడ్రస్ పాలేరని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీస్‌‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆమె.. వైఎస్ కు పులివెందులలాగే షర్మిలకు పాలేరు అడ్డా అని అన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన కార్యాలయం తాత్కాలికమేనన్న విజయమ్మ  జులై 8న కొత్త ఆఫీసు, ఇంటిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడిన తీరును గుర్తుచేసుకున్నారు. అలాంటి మాట తప్పని నాయకుడి బిడ్డైన షర్మిల కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్​ ముట్టడికి వెళ్తున్న సమయంలో కారులో కూర్చున్న షర్మిల ఆడబిడ్డ అని కూడా చూడకుండా క్రేన్‌‌లో తీసుకెళ్లి, అరెస్టు చేశారని విజయమ్మ వాపోయారు. షర్మిల 7 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుందంటే అది ప్రజల కోసమేనని అన్నారు.