- ఆమోదించిన రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, వెలుగు: వైసీపీ పార్లమెంటరీ పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఢిల్లీలో రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా మూడున్నరేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ తన పదవికి రిజైన్ చేశానని తెలిపారు. రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా సమర్పించానని, దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
జగన్ తో మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని చెప్పారు. తన రాజీనామాతో ఏపీలో అధికారంలో ఉన్న కూటమికే లబ్ధి చేకూరుతుందని అన్నారు.4 దశాబ్దాలుగా జగన్ తో, ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయాలనుంచి తప్పుకున్నానని, ఇక రాజకీయాల గురించి మాట్లాడబోనని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తనపై కేసు నమోదు చేశారని, లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులకు భయపడే తత్వం తనది కాదన్నారు. గవర్నర్ పోస్ట్, బీజేపీ నుంచి ఎంపీ పదవి కి తాను ఎవరి నుంచి హామీ తీసుకోలేదని తెలిపారు.
విజయసాయి రెడ్డి రాజీనామా ఆమోదం
విజయసాయి రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే.. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయినట్టు శనివారం సాయంత్రం రాజ్య సభ సెక్రటేరియట్ బులిటెన్ రిలీజ్ చేసింది.