కలెక్టర్‎పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు

కలెక్టర్‎పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా కలెక్టర్‎పైనే దాడి జరిగిన ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల దాడి కేసులో ఏ2 నిందితుడు, బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేష్ పోలీసులు ముందు లొంగిపోయాడు. నిందితుడు సురేష్ 2024, నవంబర్ 19న పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. దీంతో నిందితుడు సురేష్‎ను పోలీసులు కొడంగల్‌ కోర్టులో హాజరుపర్చారు. లగచర్ల దాడి ఘటనలో కీలకంగా ఉన్న సురేష్ ను పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా, వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది వెళ్లగా.. కలెక్టర్‎తో పాటు అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరగడం స్టేట్ పాలిటిక్స్‎లో కాకరేపింది. ఈ ఘటన వెనక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని.. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగొల్పారని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్‎తో కలిసి అధికారులపై దాడికి ప్లాన్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వ్యూహం ప్రకారం కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులను సురేష్ తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లాడని పోలీసులు పేర్కొన్నారు. సురేష్ అధికారులను పక్క దారి పట్టించి లగచర్లకు తీసుకువెళ్లడంతోనే గ్రామస్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. 

ఈ క్రమంలో లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఏ1 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. సురేష్‏ను  ఏ2 నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన జరిగిన నాటి నుండి సురేష్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సురేషే నేరుగా వచ్చి పోలీసులు ముందు లొంగిపోవడం గమనార్హం. ఈ కేసులో కీలకంగా ఉన్న సురేష్ లొంగిపోవడంతో.. లగచర్ల ఘటనలో నెక్ట్స్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా నిందితుడు సురేష్ బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెబుతారా అని దానిపై ఉత్కంఠ నెలకొంది.