రూ.6 వేల కోసం మహిళ దారుణ హత్య

రూ.6 వేల కోసం మహిళ దారుణ హత్య
  • ముఖం గుర్తుపట్టకుండా పెట్రోల్ తో కాల్చి పరార్
  • పెద్దేముల్​ మర్డర్​ మిస్టరీని ఛేదించిన వికారాబాద్​పోలీసులు

వికారాబాద్, వెలుగు: అప్పుగా తీసుకున్న రూ.6 వేలును తిరిగివ్వకుండా సతాయిస్తోందని ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. తర్వాత డెడ్​బాడీని గుర్తుపట్టకుండా ముఖాన్ని పెట్రోల్​పోసి కాల్చేశారు. వికారాబాద్​జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తాండూరు డీఎస్పీ ఆఫీసులో ఎస్పీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. బొంరాస్​పేట మండలం చౌదర్​పల్లి గ్రామానికి చెందిన యశోద(35) అడ్డా కూలీ. రోజూ పరిగిలో పనులకు వెళ్తుంటుంది. 

ఈ క్రమంలో పరిగి మండలం రాంరెడ్డిపల్లి తండాకు చెందిన అనిత పరిచయమైంది. కొన్నాళ్ల కిందట అనిత దగ్గర యశోద రూ.6 వేలను చేబదులుగా తీసుకుంది. తర్వాత ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీంతో యశోదపై అనిత కోపం పెంచుకుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న దోమ మండలం ఊట్పల్లికి చెందిన గోపాల్ తో కలిసి యశోదను చంపేయాలని స్కెచ్​వేసింది. ఈ నెల 2న పెద్దేముల్​మండల కేంద్రానికి సమీపంలోని కోట్​పల్లి ప్రాజెక్ట్​కెనాల్​వద్దకు యశోదను రప్పించింది.

ఫుల్లుగా మద్యం తాగించింది. తర్వాత గోపాల్​తో కలిసి యశోద గొంతు నులిమి చంపేసింది. తర్వాత యశోద మెడలోని నల్లపూసల దండలు, ముక్కు పుడకలు, కాళ్లకున్న వెండి కడియాలు లాగేసుకున్నారు. డెడ్​బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖంపై పెట్రోలు పోసి కాల్చి పరారయ్యారు. మృతురాలి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు యశోదగా గుర్తించారు. శనివారం అనిత, గోపాల్​ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.