జిల్లాలో వైరల్​ ఫీవర్​ దడ.. కార్మికుల సమ్మెతో పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

నిజామాబాద్, వెలుగు:  జిల్లాలో వైరల్ ఫీవర్​ పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా గవర్నమెంట్​ హాస్పిటల్​లో రోజుకు కనీసం 80  కేసులు నమోదవుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అంతకు నాలుగింతలు ప్రైవేట్​ హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. ఏకధాటి వర్షాలు, దోమల వ్యాప్తి, అపరిశుభ్ర పరిసరాలు వైరల్​ ఫీవర్​ను విస్తరిస్తున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులపై ప్రభావం పడుతోంది. వైరల్ ఫీవర్​కు తోడు డెంగ్యూ కేసులు నమోదవుతుండడంతో జిల్లా వైద్య శాఖ అలర్టయింది. 

113 బెడ్స్​సిద్ధం.. 

జిల్లా కేంద్రంలో జీజీహెచ్​ హాస్పిటల్​లో 1500 బెడ్స్ ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో 113 పడకలను జ్వరపీడితుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్​చేశారు. హాస్పిటల్​లో నిత్యం 1400 మంది ఓపీలకు వైద్యసేవలందించగా, అందులో 80 వరకు  వైరల్​ఫీవర్​ కేసులు ఉంటున్నాయి. ప్రైవేట్​హాస్పిటల్స్​లో వందల సంఖ్యలో అడ్మిట్ అవుతున్నారు. గ్రామాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి.  

కార్మికులు సమ్మెలో..

తమ డిమాండ్ల సాధన కోసం గత 17 రోజులుగా జీపీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం దెబ్బతింది. డ్రైనేజీల క్లీనింగ్​ లేక మురుగు నిండిపోయింది. వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు, ఈగలకు నివాసమయ్యాయి. అధిక వర్షాలతో బురదనీరు నల్లా కనెక్షన్లలో చేరి నీరు కలుషితమవుతోంది.

ఆందోళన కలిగిస్తున్న డెంగ్యూ కేసులు..

గత పది రోజుల వ్యవధిలో నాలుగు డెంగ్యూ కేసులు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నలుగురు కూడా నిజామాబాద్​నగరానికి చెందినవారే. దీన్ని బట్టి నగరంలో పారిశుధ్య పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఇద్దరు గవర్నమెంట్​లో మరో ఇద్దరు ప్రైవేట్​హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్​పొందుతున్నారు.  కార్పొరేషన్ ​పక్షాన పాలకులు దోమల సంహరణ ప్రోగ్రామ్​ యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే డెంగ్యూ విస్తరించే ప్రమాదం ఉంది. పల్లెల్లోనూ పారిశుద్ధ్యాన్ని తక్షణం మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. 

అలర్ట్​గా ఉన్నాం

వైరల్​ ఫీవర్ ​కేసులు నమోదవుతున్నందున అలర్ట్​గా ఉన్నాం. సాధారణ జ్వరం రెండురోజుల్లో తగ్గుతోంది, అలా కానీ పక్షంలో వెంటనే ట్రీట్​మెంట్​కోసం గవర్నమెంట్​ హాస్పిటల్​కు రావాలి. డెంగ్యూ నిర్ధారణ ఎలీజా టెస్ట్​ కేవలం జిల్లా ఆసుపత్రిలోనే ఉంది. మా వద్ద చేరిన ఇద్దరు డెంగ్యూ పేషెంట్లు కోలుకుంటున్నారు. నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.

 డాక్టర్ ​ప్రతిమారాజ్,​ జీజీహెచ్​సూపరింటెండెంట్​