
పిజ్జా... అనగానే చాలామందికి నోరూరుతుంది. వెజ్, నాన్‌వెజ్, కార్న్ ఇలా ఎన్ని వెరైటీలున్నాయో అన్నీ గుర్తుకొస్తాయి. కాకపోతే అదంతా ఫారినర్స్ క్రియేటివిటీ. మరి మనవాళ్ల క్రియేటివిటీ ఏంటంటారా! మనవాళ్లు చేసింది దేశీ పిజ్జా.. పేరుకు అది పిజ్జానే కానీ, షేప్‌లో మాత్రం అలా ఉండదు. ఒక్కసారి ఈ పిజ్జా టేస్ట్ చేశారంటే సూపర్ అనడం ఖాయం.
గుజరాత్లో ఫేమస్ అయ్యింది ఇటాలియన్ పిజ్జా కాదు, ‘‘కుల్హద్ పిజ్జా’’. కుల్హద్ అంటే ‘‘మట్టి కుండ’’ అని అర్థం. కుండలో పిజ్జా ఏంటబ్బా! అంటున్నారా... అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. గుజరాత్లో సూరత్‌కి చెందిన గ్రీన్ పార్క్ సొసైటీ పక్కన ఒక ఛాట్ కార్నర్ ఉంది. దానిపేరు ‘ది కోన్ ఛాట్’, ఇండియాస్ మోస్ట్ యునిక్ ఛాట్ ట్యాగ్ ఉన్న ఈ కార్నర్లో ఎప్పుడూ కొత్త కొత్త వెరైటీలు చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటారు కస్టమర్స్. తయారీలో తేడా ఏం ఉండదు. కాకపోతే బ్రెడ్‌కి బదులు కుండ వాడతారు. మామూలుగా అయితే బేస్ కోసం రౌండ్ పిజ్జా బేస్ మీద చీజ్, టొమాటో, కార్న్, క్రీమ్, సాస్‌లను లేయర్స్‌లా వేస్తారు. ఆ తర్వాత దాన్ని ఒవెన్ పెట్టి బేక్ చేస్తే, పిజ్జా రెడీ అవుతుంది. అలాగే ఈ కుండ పిజ్జాలో, ముందుగా ఒక గిన్నెలో పిజ్జాకి కావాల్సిన పదార్థాలన్నీ వేసి, కలపాలి. ఆ మిశ్రమాన్ని కుండలో సగం వరకు వేయాలి. ఆ తర్వాత మళ్లీ అవే పదార్ధాలను రెండు లేయర్స్‌గా వేయాలి. చివరిగా దాన్ని ఒవెన్‌లో పెట్టి బేక్ చేస్తే నోరూరించే కుండ పిజ్జా రెడీ. ‘ఆమ్చి ముంబై’ పేరుతో వీడియోలు చేసే ఒక యూట్యూబర్ ఈ ఏడాది మార్చిలో ఈ వీడియోని అప్లోడ్ చేశాడు. అప్పుడేమోగానీ, ఇప్పుడు ఈ వీడియో 22 లక్షల వ్యూస్‌కు చేరి వైరల్ అయ్యింది.