T20 World Cup 2024: ఆ ఇద్దరితో పోలిస్తే గిల్ అదృష్టవంతుడు: వీరేంద్ర సెహ్వాగ్

T20 World Cup 2024: ఆ ఇద్దరితో పోలిస్తే గిల్ అదృష్టవంతుడు: వీరేంద్ర సెహ్వాగ్

వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లలో యువ టాలెంటెడ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో గిల్ ను ట్రావెలింగ్ రిజర్వ్‌ ప్లేయర్లలో ఒకడిగా ఎంపిక చేశారు. లెఫ్ట్ హ్యాండర్ కారణంగా ఓపెనర్ గా గిల్ కు బదులుగా యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేశారు. దీంతో గిల్ కు నిరాశ తప్పలేదు. అయితే గిల్ పేరు ట్రావెలింగ్ రిజర్వ్‌లో ఉండడం తన అదృష్టమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు.   

"గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన గిల్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 322 పరుగులు మాత్రమే చేశాడు. భవిష్యత్తులో జట్టు నుండి తొలగించబడకుండా ఉండటానికి గిల్ ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. టీ20 ప్రపంచకప్‌లో అతని పేరు ఉండటం అదృష్టమని నేను భావిస్తున్నాను. కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కనీసం అందులో కూడా లేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి". అని క్రిక్‌బజ్‌లో జరిగిన చర్చలో సెహ్వాగ్ తెలిపాడు.
   
2023 సీజన్ లో గిల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. అసాధారణ ఆట తీరుతో 891 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. అయితే టీమిండియా టీ20 జట్టులో ఎన్ని అవకాశాలు ఇచ్చినా గిల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. న్యూజిలాండ్ పై సెంచరీ మినహాయిస్తే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమీ లేదు. వీటితో పాటు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో గిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా విఫలమవుతున్నాడు. ఈ కారణంగానే గిల్ టీ20 వరల్డ్ కప్ లో చోటు కోల్పోయాడని తెలుస్తుంది.