బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే : వివేక్ వెంకటస్వామి

  • ఉమ్మడి జిల్లాలో ఘనంగా పూలే జయంతి వేడుకలు 

నెట్​ వర్క్​​,వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంస్కర్త అని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొనియాడారు. గురువారం రామకృష్ణాపూర్​ రాజీవ్​చౌక్​ వద్ద కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఫూలే ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పూలే సామాజిక కట్టుబాట్లను ఎదిరించి, కులవ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేశారన్నారు. చదువుతోనే మార్పు సాధ్యమని అప్పట్లోనే గుర్తించారని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆయనే కారణమని స్పష్టం చేశారు. కాంగ్రెస్​ ఆఫీస్​ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆ పార్టీ లీడర్లు పాల్గొన్నారు.

మహిళవిద్యాప్రధాత పూలే – వెడ్మ బొజ్జు 

 బడుగుల అభ్యున్నతికి, మహిళల విద్యకోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఖానాపూర్​లో నెలకొల్పడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చెప్పారు. ఖానాపూర్ పాత బస్టాండ్ దగ్గర జరిగిన జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజురా సత్యం, కావలి సంతోష్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మందమర్రి ఏరియా సింగరేణి స్టోర్స్​లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. 

కార్యక్రమంలో ఏరియా స్టోర్స్​ డీజీఎం నాగరాజు నాయక్​, ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్​, ఏఐటీయూసీ కార్పోరేట్​ చర్చల ప్రతినిధి సలెంద్ర సత్యనారాయణ, సామాజిక వేత్త గొడిసెల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మందమర్రి మున్సిపల్​ ఆఫీస్​లో పూలే ఫోటోకు మున్సిపల్​ కమిషనర్​ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ తరానికి జ్యోతిబాఫూలే ఆదర్శప్రాయుడని మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగోశే శంకర్ అన్నారు. ఆసిఫాబాద్​ భాగ్యనగర్ ఎక్స్ రోడ్ వద్ద సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. 

జ్యోతిబాపూలేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన మార్గంలో నడవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాజు అన్నారు. నిర్మల్ బీజేపీ ఆఫీసులో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. నిర్మల్​లో బీసీ సంక్షేమ సంఘం, జన్నారంలో అంబేద్కర్ సంఘం,బీసీ సంఘాలు, మాలి సంఘం, బీజేపీ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు జరిగాయి