- వనపర్తి జిల్లాలో ఆవుదూడల మృత్యువాత
- మందుల్లేక గోట్ ఫాక్స్ టీకాలు ఇస్తున్న వెటర్నరీ డాక్టర్లు
- చర్మం ఊడి వికారంగా మారుతున్న పశువులు
వనపర్తి, వెలుగు : జిల్లాలో పాడి ఆవులు, లేగ దూడలు, ఎద్దులు లంపీస్కిన్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఈ వ్యాధి విజృంభించడంతో పశువులు తీవ్ర జ్వరాన్ని తట్టుకోలేక చనిపోతున్నాయి. ఈ వ్యాధికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో వెటర్నరీ డాక్టర్లకు గోట్ ఫాక్స్ టీకాలు ఇస్తున్నా కంట్రోల్ కావడం లేదు. ఈ వ్యాధి తీవ్రత పెరగడంతో జిల్లా పశు వైద్యాధికారులు అలర్ట్ ప్రకటించారు. 49 టీమ్లతో శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నారు.
వాతావరణంలోని మార్పులు, దోమకాటుతో లంపీస్కిన్ త్వరగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఈ వ్యాధి బారిన పడిన దేశవాళి పశువులు తట్టుకోలేక పోతున్నాయి. కొన్ని బతుకుతున్నా పుండ్లు అయిన చోట చర్మం ఊడి వికారంగా తయారవుతున్నాయి.
రైతుల్లో ఆందోళన..
లంపీస్కిన్ సోకిన లేగ దూడల మూతి వాచిపోయి పాలు తాగలేక అవి చనిపోతున్నాయి. గేదెల్లో ఈ వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. ఆవులు, కోడెలు, దూడలు ఈ వ్యాధి భారిన పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో 70 వేలకు పైగా ఆవులు, కోడెలు ఉన్నాయి. వీటిలో 48 శాతం జీవాలకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి ముందస్తుగా టీకాలు వేశారు.
మరోవైపు గాలికుంటు వ్యాధి..
వాతావరణ మార్పులతో జిల్లాలోని గొర్రెలు, మేకలు గాలికుంటు వ్యాధి బారిన పడుతున్నాయి. కాళ్లకు పుండ్లు కావడంతో నడవలేకపోతున్నాయి. దీంతో రోగం వచ్చిన గొర్రెలు, మేకలను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఒక పక్క వర్షాలు లేక పశుగ్రాసం దొరకక ఇబ్బంది పడుతుండగా, మరోవైపు సీజనల్ వ్యాధులతో ఆందోళన చెందుతున్నారు. గేదెలు గాలికుంటు బారిన పడడంతో పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలోని మదనాపురం, ఆత్మకూర్, కొత్తకోట ప్రాంతాల్లో పశువులకు వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
పెబ్బేరు మండల కేంద్రంలోని పశువుల సంతకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పశువుల ద్వారా వ్యాధులు వస్తున్నాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. సంతల్లో పశువులు , గొర్రెలు, మేకలు కొనేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటికి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.
క్యాంప్లు ఏర్పాటు చేశాం..
వాతావరణంలో మార్పులతో పశువులకు గాలికుంటు, లంపీస్కిన్ వంటి వ్యాధులు సోకాయి. వీటిని అరికట్టేందుకు గ్రామాల్లో 49 టీమ్లతో క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు లంపీస్కిన్ బారిన పడిన పశువులకు గోట్ ఫాక్స్ టీకాలు ఇస్తున్నాం. రైతులు అప్రమత్తంగా ఉండి లంపీస్కిన్ ను ఎదుర్కోవాలి.
- వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి
పరిహారం ఇవ్వాలి..
ఇలాంటి రోగం మునుపు చూడలే. డాక్టర్లు మందులు లేవని చెబుతున్నారు. పెద్ద కోడె ఈ రోగంతో చనిపోయింది. చనిపోయిన పశువులకు సర్కారు పరిహారం ఇవ్వాలి.
- నాగేశ్, నర్సింగాపురం