- వనపర్తి మున్సిపాలిటీలో ముగిసిన పాలకవర్గ పదవీకాలం
వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపల్సమావేశం పాలకవర్గం పదవీకాల చివరి రోజున రసాభాసగా ముగిసింది. పాలకపార్టీ, ప్రతిపక్ష సభ్యుల మధ్య బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అన్నీ సగం పనులే చేశారని పాలక పార్టీ సభ్యులు ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యుల వార్డులకు జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి, పాలక పార్టీ సభ్యుల వార్డులకు ఆర్థిక సంఘం నుంచి నిధులివ్వడం ఎంత వరకు సమంజసమంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు.
పార్టీలకతీతంగా వనపర్తి పట్టణాన్ని త్వరితగతిన పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కౌన్సిలర్లందరినీ శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మహేశ్, వైస్ చైర్మన్ కృష్ణయ్య, కమిషనర్ పూర్ణచందర్, 33 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.