సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డెకాయిటీ గ్యాంగ్ పట్టుబడింది. ఏప్రిల్ 12వ తేదీ బుధవారం అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ మూఠాలో ఐదుగురు సభ్యుల అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముఠా నుండి మూడు కంట్రీ మేడ్ పిస్టల్స్, ఆరు రౌండ్స్ బుల్లెట్స్, భారీగా నగదు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరుడు గట్టిన అంతరాష్ట్ర గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. పూణే నుంచి ఈ మూఠా వచ్చినట్లు సీపీ పేర్కొన్నారు.
ఈనెల 8న హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ లో ఐదుగురు నిందితులు వచ్చారు. హైదరాబాద్ షాపూర్ నగర్ లో షెల్టర్ తీసుకున్న నిందితులు.. బ్యాంకులు, జువెలరీ షాపులను చోరీ చేసేందుకు పతకం వేశారు. ఈ ముఠాలోని నిహాల్, జీత్ సింగ్ ఇద్దరు టాటా ఇండికా కారు చోరీ చేయగా.. అమర్ సింగ్, లక్కీ సింగ్, నిశాంత్ లు స్క్రూ డ్రైవర్లు, ఇతర పరికరాలు తీసుకొచ్చారు. ముందుగా షాపూర్ నగర్ లోని ఓ జువెలరీ షాపులో రెక్కి నిర్వహించారు. జువెలరీ షాపులో చోరీ చేసి తర్వాత కారులో పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే 11వ తేదీ రాత్రి షాపూర్ నగర్ లోని ఆదర్శ బ్యాంక్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు నిందితులు. ఈ ఐదుగురు పూణేలో మోస్ట్ వాంటెడ్ దొంగలుగా ఉన్నారని.. ఈ ముఠాపై 175కు పైగా కేసులు ఉన్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు.