పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు!
  • మిలటరీని మరింత బలోపేతం చేయనున్న అమెరికా
  • అదనపు బాలిస్టిక్  మిసైళ్లు,డెస్ట్రాయర్ల తరలింపు
  • ఇజ్రాయెల్ కు ఏ సాయమైనా చేస్తామని బైడెన్  హామీ
  • లెబనాన్ నుంచి వెంటనే బయట పడాలని తమ 
  • పౌరులకు అమెరికా హెచ్చరిక 

ఇజ్రాయెల్, ఇరాన్  మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.  హమాస్  చీఫ్  ఇస్మాయెల్  హనియా హత్య తర్వాత ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం ఇరాన్  రగిలిపోతున్నది. హనియాను ఇజ్రాయెల్  బలగాలే చంపాయని ఇరాన్  అనుమానిస్తున్నది. అమెరికా కూడా హనియా హత్యకు సాయం చేసిందని భావిస్తున్నది. ఫహద్, హనియా హత్యలకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడి చాలా భయంకరంగా ఉంటుందని ఇరాన్  హెచ్చరించింది. మరోవైపు యుద్ధం వస్తే ఇజ్రాయెల్ కు ఏ సాయమైనా చేస్తామని అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్ ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్  మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత నెల 31న తమ దేశంలో హమాస్  చీఫ్  ఇస్మాయెల్  హనియా హత్య తర్వాత ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం ఇరాన్  రగిలిపోతున్నది. హనియాను ఇజ్రాయెల్  బలగాలే చంపాయని ఇరాన్  అనుమానిస్తున్నది. 

అంతకుముందు, సిరియాకు నైరుతిలో ఉన్న గోలన్ లో రాకెట్  దాడిచేసి 12 మంది తమ పౌరుల హత్యకు కుట్రపన్నాడంటూ హెజ్బొల్లా కమాండర్  ఫహద్  షుక్ర్ ను బీరట్ లో ఇజ్రాయెల్  బలగాలు మట్టుబెట్టాయి. దీంతో ఇజ్రాయెల్ పై ప్రతిదాడి కోసం ఇరాన్  వ్యూహాలు రచిస్తున్నది. అంతేకాకుండా, అమెరికా కూడా హనియా హత్యకు సాయం చేసిందని పేర్కొంది. 

ఫహద్, హనియా హత్యలకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడి చాలా భయంకరంగా ఉంటుందని ఇరాన్  హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ -– ఇజ్రాయెల్  మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాకు అమెరికా ఫైటర్ జెట్  స్వ్కాడ్రన్ ను పంపనుంది.

 ఆ ప్రాంతంలోని ఎయిర్ క్రాఫ్ట్  క్యారియర్ ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని పెంటగాన్  శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ పై ఇరాన్  ఏ క్షణమైనా దాడిచేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మిలిటరీ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రెసిడెంట్  జో బైడెన్  ఇదివరకే హామీ ఇచ్చారు. పశ్చిమాసియాకు మరిన్ని అదనపు బాలిస్టిక్  మిసైళ్లు, క్రూజర్లు, డెస్ట్రాయర్లను పంపుతామని యూఎస్  డిఫెన్స్  లాయిడ్  ఆస్టిన్  తెలిపారు.

జాగ్రత్తగా ఉండండి.. ఇండియన్లకు మన ఎంబసీ వార్నింగ్

హెజ్బొల్లా లీడర్  ఫహద్  షుక్ర్, హమాస్  చీఫ్  ఇస్మాయెల్  హనియా హత్య నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్​లో ఉంటున్న భారతీయులను ఇండియా ఎంబసీ హెచ్చరించింది. అలాగే, వెంటనే లెబనాన్  నుంచి వెళ్లిపోవాలని, తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అక్కడకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్ కు వెళ్లే, ఇజ్రాయెల్  నుంచి వచ్చే విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.

లెబనాన్  నుంచి బయట పడండి

ఇరాన్ – ఇజ్రాయెల్  మధ్య ఉద్రిక్త పరిస్థితుల మూలంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్  పొరుగు దేశం లెబనాన్ లో ఉంటున్న తమ పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని అమెరికా, యూకే, స్వీడన్  హెచ్చరించాయి. ఏ విమానం టికెట్  దొరికితే ఆ విమానం ఎక్కి లెబనాన్  నుంచి ముందు బయట పడాలని తమ పౌరులకు సూచించాయి.

 ‘‘ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు మరింత దిగజారేలా ఉన్నాయి. లెబనాన్ లో ఉన్న మా దౌత్య కార్యాలయంతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతున్నాం. యూకే పౌరులు వెంటనే లెబనాన్ ను వీడేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నాం” అని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్  లామీ తెలిపారు. అలాగే స్వీడన్  కూడా తమ పౌరులకు ఇలాగే హెచ్చరికలు పంపింది. లెబనాన్ లోని బీరట్ లో ఉన్న తమ ఎంబసీని మూసివేసి తాత్కాలికంగా సైప్రస్ కు మార్చింది. వెంటనే బీరట్ ను వీడి సైప్రస్ కు వెళ్లిపోవాలని తన స్టాఫ్ కు స్వీడన్  విదేశాంగ శాఖ సూచించింది.