- బాన్సువాడ కాంగ్రెస్‌లో కుదరని సయోధ్య
- ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం
- నియోజకవర్గంలో ఉండొద్దని ఆధిష్టానం చెప్పిందన్న పోచారం
- నేనేందుకు వెళ్లాలన్న రవీందర్‌రెడ్డి
కామారెడ్డి , వెలుగు : బాన్సువాడ నియోజక వర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య ఇటీవల మాటల యుద్దం కొనసాగుతోంది. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదరలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బరిలో దిగారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఎన్నికల్లో ఓడిన ఏనుగు రవీందర్‌రెడ్డిని నియోజక వర్గ ఇన్చార్జిగా పార్టీ నియమించింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక పర్యాయం మంత్రిగా, మరో ఐదేండ్లు స్పీకర్‌గా పని చేశారు. బాన్సువాడలో మళ్లీ ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నియోజక వర్గంలో ఏనుగు రవీందర్‌రెడ్డి చెప్పిందే వేదంగా మారింది. ఎన్నో ఏండ్లుగా నియోజక వర్గాన్ని శాసించిన పోచారానికి ఇది మింగుడు పడలేదు. అధికారులు మాజీ ఎమ్మెల్యే మాటకే విలువ ఇస్తున్నారు.
గతంలో ఇక్కడ పని చేసిన ఆఫీసర్లను బదిలీ చేయించారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు రవీందర్‌రెడ్డి పోస్టింగ్‌లు కూడా ఇప్పించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొద్ది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో నియోజక వర్గంలో కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఏర్పాడ్డాయి. కొందరు ఏనుగు రవీందర్‌రెడ్డి వెంట ఉండగా, మరి కొందరు పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెంట ఉన్నారు.
వేర్వేరుగా తిరుగుతూ
పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీంధర్‌రెడ్డి నియోజక వర్గంలో వేర్వేరుగా తిరుగుతున్నారు. ఒకరు వెళ్లే పోగ్రాంకు మరో నేత క్యాడర్ వెళ్లడం లేదు. నామినేటేడ్ పోస్టుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాటే ఎక్కువగా చెల్లు బాటు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజక వర్గంలో పోస్టింగ్‌లు పొందిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లను ఇటీవల మార్చారు. బాన్సువాడ టౌన్, రూరల్ సీఐలను మార్చి కొత్త వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇది కూడా అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణమైంది.
తాజాగా ఒకరిపై ఒకరు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు తాజాగా బహిరంగ విమర్శలతో నియోజకర్గ రాజకీయాలు హీటెక్కాయి. ఇటీవల వర్ని మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార పోగ్రాంలో ఏనుగు రవీందర్‌రెడ్డి పై పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు చేశారు. ఓడిన వ్యక్తి నియోజక వర్గ రాజకీయాల్లో కలుగజేసుకోవద్దని పార్టీ పెద్దలు సూచించారంటూ మాట్లాడారు. దీనిపై ఏనుగు రవీందర్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. తాను ఎందుకు నియోజక వర్గాన్ని వదిలి పెట్టి వెళ్లాలని, 40 ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.