- 2016లో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన వరంగల్, కరీంనగర్
- నిధుల్లేకపోవడంతో పనులు తగ్గించిన ఆఫీసర్లు
- కనిపించని స్మార్ట్ బస్టాండ్లు, కమాండ్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ లెవల్ కార్‌పార్కింగ్
కరీంనగర్, వెలుగు : హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ వంటి సేవల్లో టెక్నాలజీని పెంచడం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల రక్షణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రీసైకిల్డ్ వాటర్ సిస్టమ్, రీనవబుల్ ఎనర్టీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీలు అనేది అంతర్జాతీయంగా ఉన్న స్మార్ట్ సిటీ కాన్సెప్ట్. కానీ మన రాష్ట్రంలోని కరీంనగర్, వరంగల్‌లో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులను రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, జంక్షన్ల అభివృద్ధికే పరిమితం చేశారు. కరీంనగర్, వరంగల్ నగరాల్లో ఇప్పటివరకు రినవబుల్ ఎనర్జీ, రీసైకిల్డ్ వాటర్ సిస్టమ్స్ ఏర్పాటు కాలేదు. నిధుల కొరత కారణంగా స్మార్ట్ బస్టాండ్లు, కమాండ్ కంట్రోల్ సిస్టం, మల్టీ లెవల్ కార్ పార్కింగ్ జోన్లను పనుల లిస్ట్ నుంచే ఎత్తేశారు.
నిధుల్లేక ప్రాజెక్టులను పక్కన పెట్టేసిన్రు
2016 జూన్‌లో కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ నగరాలు ఎంపికయ్యాయి. 2016 – 17 నుంచి ఐదేండ్ల పాటు కేంద్రం ఏటా రూ.100 కోట్ల చొప్పున ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్రం మరో రూ.100 కోట్లను ఇవ్వాలి. ఇలా వచ్చే మొత్తం రూ. వెయ్యి కోట్లతో నగరాల్లో రోడ్లు, జంక్షన్లు, పార్క్‌లు, బస్‌బేలు, ఇతరత్రా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ వస్తాయన్న ధీమాతో రూ. 2,860 కోట్లతో వరంగల్ డీపీఆర్, రూ. 1,878 కోట్లతో కరీంనగర్ డీపీఆర్‌ను రెడీ చేశారు. కానీ మూడింట ఒక వంతు నిధులు కూడా ఖర్చు చేయలేదు.
గత బీఆర్‌ఎస్ సర్కార్ సమయానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, కేంద్రం ముందుగా ప్రకటించిన నిధులన్నీ మంజూరు చేయకపోవడంతో కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీల్లో పనులను తగ్గించుకోవాల్సి వచ్చింది. రోడ్లు, డ్రైనేజీలతో పాటు కొన్ని పనులు మాత్రమే పూర్తి చేసి స్మార్ట్ సిటీకి అర్థాన్ని ఇచ్చే అసలైన పనులను పక్కన పెట్టేశారు. కరీంనగర్‌లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ జోన్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, మోడర్న్ స్లాటర్ హౌజ్ వంటి 40 ప్రాజెక్ట్‌లు అటకెక్కాయి.
డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కాలేదు. వైఫై జోన్స్, సిగ్నలింగ్, సెక్యూరిటీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. వేములవాడ బై పాస్‌లో టూరిజం డెవలప్‌మెంట్ ప్రతిపాదన, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆధునికీకరణ, డిజిటల్ లైబ్రరీ, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ వంటి ప్రాజెక్ట్‌లు ఊసే లేకుండా పోయాయి. అలాగే వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో మొదట అనుకున్న 101 పనులను చివరకు 62కు తగ్గించారు.
కీలకమైన హనుమకొండ స్మార్ట్ సిటీ బస్టాండ్‌ను లిస్ట్‌లోంచి తొలగించారు. పీపీపీ పద్ధతిలో రూ.135 కోట్లతో హనుమకొండ అశోక సెంటర్, భద్రకాళి టెంపుల్ వద్ద ప్లాన్ చేసిన పార్కింగ్ ఏరియా డెవలప్‌మెంట్ పనులను కూడా క్యాన్సిల్ చేశారు. వీటితో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్, జూపార్క్, పోతన మ్యూజియం డెవలప్‌మెంట్, చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి.. ఇలా ముఖ్యమైన పనులన్నింటినీ పక్కనపెట్టేశారు.
రెండు కాంపోనెంట్స్‌లో ఫెయిల్
స్మార్ట్ సిటీ పనుల్లో ప్రధాన కాంపోనెంట్ పాన్ సిటీ ఇన్షియేటివ్స్. ఇందులో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం, ట్రాన్స్‌పోర్టేషన్‌ను ఈజీ చేయడం, మొబిలిటీని రెగ్యులేట్ చేయడం వంటి పనులు వస్తాయి. కానీ ఈ పనులేవీ వరంగల్, కరీంనగర్‌లో చేపట్టలేదు. అలాగే ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ అనేది మరో కాంపోనెంట్. ఇందులో కూడా కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీలు సక్సెస్ కాలేదు. ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా సిటీలో ఒక భాగాన్ని ఎంచుకొని అక్కడ స్మార్ట్ టెక్నిక్స్‌ను అప్లై చేయాల్సి ఉంటుంది.
అక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఇంటర్నెట్‌తో సర్వీసులు డెలివరీ చేయాలి. అయితే ఈ కాంపోనెంట్ సక్సెస్ కావడానికి కొత్తగా వెలసిన కాలనీలు, శివారు ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. కానీ వరంగల్‌లో రామన్నపేట, గోవిందరాజులగుట్ట వంటి రద్దీ ప్రాంతాలను ఎంచుకున్నారు. దీంతో ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేయాల్సిన పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేని పరిస్థితి నెలకొంది.